Viral Videos: రీల్స్ పైత్యం.. యువకుడి చేయిపట్టుకుని భవనంపై నుంచి వేల్లాడిన యువతి!

Pune Woman Hangs From Building Holding Mans Hand All For A Reel

  • పూణెలో యువతీయువకుల ప్రమాదకర స్టంట్
  • యువకుడి చేయి పట్టుకుని భవనం పైనుంచి వేలాడిన యువతి
  • తమ పిడికిలి శక్తి ఎంత ఉందో ప్రదర్శించేందుకు యత్నం
  • నెట్టింట వీడియో వైరల్, బాధ్యులపై పోలీసు కేసు నమోదు

యువత రీల్స్‌ వ్యసనం ఉన్మాదంగా మారుతోంది. వ్యూస్, లైక్స్ కోసం తాము ఏం చేస్తున్నామో కూడా గుర్తించలేని స్థితిలో పడిపోతున్నారు. తాజాగా షార్ట్ వీడియో చిత్రీకరణ కోసం ఓ యువతి మరో యువకుడి సాయంతో అత్యంత ప్రమాదకరమైన రీతిలో భవంతిపై నుంచి వేలాడింది. ఈ వీడియో నెట్టింట కలకలం రేపడంతో రంగంలోకి దిగిన పోలీసులు యువతి, ఆమెకు సహకరించిన వారిపై కేసు నమోదు చేశారు. 

పూణెలో ఈ ఘటన వెలుగు చూసింది. తమ పిడికిలి శక్తి ఎంత ఉందో పరీక్షించేందుకు యువతీయువకులు ఈ ప్రాణాంతక స్టంట్‌కు పూనుకున్నారు. ఓ యువకుడు యువతి చేయి పట్టుకుని భవనంపై నుంచి 100 అడుగుల ఎత్తున వేలాడదీశాడు. పూణెలోని స్వామి నారాయణ్ టెంపుల్‌లో రీల్‌ను చిత్రీకరించినట్టు తెలుస్తోంది. ఈ స్టంట్‌ను అన్ని కోణాల నుంచి చిత్రీకరించేందుకు వారు ఏకకాలంలో పలు కెమెరాలను కూడా వినియోగించారు. ఒకరు మేడ పైనుంచి, మరొకరు నేలపై నిలబడి రికార్డు చేశారు. మరోవ్యక్తి, యువతిని పట్టుకున్న యువకుడి పక్కనే బోర్లాపడుకుని వీడియోను రికార్డు చేశాడు. 

ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ప్రాణాపాయం కలిగేలా నిర్లక్ష్యంగా వ్యవహరించిన నేరం కింద కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు.

More Telugu News