Tamil Nadu: తమిళనాడులో కల్తీ మద్యం తాగి 38 మంది మృతి... తీవ్రంగా స్పందించిన శశికళ

 Kallakurichi hooch tragedy Death toll rises to 38

  • కళ్లకురిచిలో కల్తీ మద్యం ఘటన
  • ఘటనకు బాధ్యులైన వారిని అరెస్ట్ చేయాలన్న శశికళ 
  • సీబీఐ విచారణ కోరుతూ అమిత్ షాకు అన్నామలై లేఖ

తమిళనాడులోని కళ్లకురిచిలో కల్తీ మద్యం తాగి 38 మంది వరకు మృతి చెందారు. చాలామంది అనారోగ్యానికి గురై ఆసుపత్రి పాలయ్యారు. ఈ విషాద సంఘటనపై జయలలితకు అత్యంత సన్నిహితురాలైన వీకే శశికళ తీవ్రంగా స్పందించారు. కల్తీ మద్యం కారణంగా జరిగిన మరణాలకు స్టాలిన్ ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ఘటనకు బాధ్యులైన వారిని వారం రోజుల్లో అరెస్ట్‌ చేయాలని డిమాండ్ చేశారు. సంబంధిత అధికారులను బదిలీలతో సరిపెట్టకుండా సస్పెండ్ చేయాలన్నారు.

ప్రభుత్వం తక్షణ చర్యలను చేపట్టకుంటే ప్రజలే నిర్ణయం తీసుకుంటారని హెచ్చరించారు. ప్రభుత్వానికి తెలియకుండా ఈ ఘటన జరిగే అవకాశం ఉందని తాను అనుకోవడం లేదన్నారు. ఇవి ప్రభుత్వం చేసిన హత్యలుగానే భావిస్తున్నామన్నారు. స్టాలిన్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు గాల్లో కలిశాయని ఆవేదన వ్యక్తం చేశారు. నాటుసారాకు తమిళనాడు అడ్డాగా మారిందని ఆరోపించారు. 

సీబీఐ విచారణకు అన్నామలై విజ్ఞప్తి

కల్తీ మద్యం తాగి పదుల సంఖ్యలో చనిపోయిన ఘటనపై సీబీఐ దర్యాఫ్తు జరగాలని బీజేపీ తమిళనాడు శాఖ అధ్యక్షుడు అన్నామలై అన్నారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. సీబీఐ దర్యాఫ్తు జరిపించాలని ఆయనను కోరారు. ఈ ఘటనకు కారణమైన వారిని తప్పకుండా శిక్షించాలని కోరారు.

అధికారులపై చర్యలు

కల్తీ మద్యం ఘటన నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం... జిల్లా కలెక్టర్ శ్రవణ్ కుమార్ జటావత్‌ను బదిలీ చేసింది. పోలీసు సూపరింటెండెంట్ సమయ్ సింగ్ మీనాను సస్పెండ్ చేసింది. కళ్లకురిచిలో ఎలాంటి అనుచిత ఘటనలు జరగకుండా వివిధ జిల్లాల నుంచి 2000 మంది పోలీసులను రప్పించారు. ఘటనపై విచారణకు ఏకసభ్య కమిషన్‌ను నియమించింది. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున, తీవ్ర అస్వస్థతకు గురైనవారికి రూ.50 వేలు చొప్పున ప్రభుత్వం ప్రకటించింది. కల్తీ మద్యం ఘటనపై గవర్నర్ ఆర్ఎన్ రవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News