Gudem Mahipal Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు
- పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డి ఇంట్లో ఈడీ తనిఖీలు
- గురువారం తెల్లవారుజాము నుంచే ఏక కాలంలో ఈడీ అధికారుల సోదాలు
- పటాన్‌చెరులోని మూడు ప్రాంతాల్లో సోదాలు
- అలాగే నిజాంపేటలోని వారి బంధువుల ఇళ్లలోనూ ఈడీ తనిఖీలు
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇవాళ తెల్లవారుజాము నుంచే ఏక కాలంలో మహిపాల్ రెడ్డి, ఆయన సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి ఇళ్లల్లో తనిఖీలు చేపట్టారు.
ఇద్దరు సోదరులు మైనింగ్ తో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. గతంలో ఒక కేసులో గూడెం మధు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. గతంలో లగ్డారం గనుల వ్యవహారంలో కేసు నమోదైంది. దాని ఆధారంగానే ఈడీ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం.
పటాన్‌చెరులోని మూడు ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. అలాగే, నిజాంపేటలోని వారి బంధువుల ఇళ్లలోనూ ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. సోదాలపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. కాగా, ఇటీవల మహిపాల్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరబోతున్నారంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఈడీ దాడులు జరగడంతో ఈ అంశం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.