Rahul Dravid: కీలక మార్పుల దిశగా హింట్ ఇచ్చిన రాహుల్ ద్రావిడ్

Need something different in Barbados Rahul Dravid hints at major bowling change for Afghanistan game

  • త్వరలో టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 మ్యాచ్
  • అమెరికాతో పోలిస్తే బార్బడాస్‌లో భిన్నమైన పరిస్థితులు
  • కుల్దీప్, యజువేంద్రను ఈసారి రంగంలోకి దింపే అవకాశం ఉందన్న ద్రావిడ్

బార్బడాస్ వేదికగా త్వరలో జరగనున్న టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 మ్యాచ్‌కు సంబంధించి టీమిండియా బౌలింగ్ లైనప్‌లో కీలక మార్పులు చేపట్టబోతున్నట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ సంకేతాలిచ్చారు. యూఎస్ఏతో పోల్చితే బార్బడాస్‌లో పరిస్థితులు భిన్నంగా ఉంటాయని, కాబట్టి కుల్దీప్ యాదవ్ లేదా యజువేంద్ర చహల్‌కు ఛాన్సిచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. 

ఇప్పటివరకూ సూపర్ 8 మ్యాచుల్లో టీమిండియా కూర్పులో ఎటువంటి మార్పులు లేని విషయం తెలిసిందే. ఈ టీంతోనే రాహుల్ ద్రావిడ్ ఆశించిన ఫలితాలు రాబట్టారు. కుల్దీప్, యజువేంద్ర బెంచ్ కు పరిమితం కాగా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ స్పిన్ బౌలింగ్ బాధ్యతలు మోశారు. అయితే, యూఎస్ఏలో పరిస్థితి పేస్ బౌలర్లకు అనుకూలంగా ఉండటంతో స్పిన్ బౌలర్లు తడబడ్డారు. వికెట్లు రాబట్టలేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో బ్రిడ్జ్ టౌన్‌లో జరిగిన పత్రికా సమావేశంలో రాహుల్ ద్రావిడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 

‘‘ఓ క్రీడాకారుడిని పక్కన పెట్టడం చాలా కష్టమైన అంశం. న్యూయార్క్.. పేస్ బౌలర్లకు అనుకూలించింది. కానీ బార్బడాస్ లో పరిస్థితులకు తగినట్టు టీమిండియాలో మార్పులు అవసరం కావొచ్చు. యజువేంద్ర లేదా కుల్దీప్ ను రంగంలోకి దింపే ఛాన్సుంది. ఆల్ రౌండర్లుగా ఆడే సత్తా ఉన్న ప్లేయర్లు టీమిండియాలో ఉండటం మా అదృష్టం. మా దగ్గర ఎనిమిది మంది బ్యాటర్లు ఉన్నప్పటికీ బౌలింగ్‌కు సంబంధించి ఏడుగురు అందుబాటులో ఉన్నారు’’ అని ద్రావిడ్ వివరించాడు. 

‘‘ప్రతి మ్యాచ్ దేనికదే ప్రత్యేకమైనది. ఇలాగే ఉండాలని ఆశించలేము. కాబట్టి, పరిస్థితులకు అనుగుణంగా మారాలని నేను భావిస్తాను. అందుకే అక్షర్ పటేల్‌కు ఛాన్సిచ్చాము. రిషభ్ పంత్ ను నెం.3 లో పంపే విషయంలో కూడా చాలా ఆలోచించాల్సి వచ్చింది. టెస్టు క్రికెట్ లో ఇలాంటి మార్పులకు అవకాశం ఉండదు. ఎవరిని ఏ స్థానంలో ఆడించాలన్న అంశానికి టీ20ల్లో ప్రాధాన్యం ఎక్కువ. ఇలాంటివి ఈ మధ్య తరచూ జరుగుతున్నాయి’’ అని రాహుల్ ద్రావిడ్ అన్నాడు. ప్రస్తుతం, కుల్దీప్, యజువేంద్రతో పాటు బెంచ్‌కు పరిమితమైన సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్ వరల్డ్ కప్ ఎంట్రీ కోసం వేచి చూస్తున్నారు. అయితే, బ్యాటర్ల విషయంలో మాత్రం టీమిండియా ఎటువంటి మార్పులు చేయకపోవచ్చన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News