New Delhi: ఢిల్లీలో అధిక ఉష్ణోగ్రతలు... వడదెబ్బతో ఐదుగురి మృతి

5 dead in Dealhi with heatwave in India

  • తీవ్రమైన ఎండలతో పెరిగిన వడదెబ్బ కేసులు
  • ఢిల్లీలో వెంటిలేటర్‌పై మరో 12 మంది
  • ఢిల్లీలో నిన్న 51 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

దేశవ్యాప్తంగా ఈసారి ఉష్ణోగ్రతలు రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. ఢిల్లీ సహా చాలా ప్రాంతాల్లో 45 డిగ్రీల కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గడిచిన 72 గంటల్లో దేశ రాజధానిలో వేడిగాలులు పలువురి ప్రాణాలను తీసుకున్నాయి. పెరుగుతున్న ఎండలతో వడదెబ్బ కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఢిల్లీలో రెండ్రోజుల్లోనే ఐదుగురు మృత్యువాత పడ్డారు. వడదెబ్బతో వెంటిలేటర్‌పై మరో 12 మంది చికిత్స పొందుతున్నారు. వడదెబ్బ కారణంగా ఉత్తరప్రదేశ్‌లోను పదుల సంఖ్యలో మృత్యువాత పడ్డారు.

వడదెబ్బ కారణంగా ఢిల్లీలో మరణాల రేటు 60 శాతం నుంచి 70 శాతంగా ఉంది. నెల రోజులుగా ఢిల్లీవాసులు అధిక ఉష్ణోగ్రతలు... ఎండవేడితో అల్లాడిపోతున్నారు. దాదాపు నిత్యం ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటుతున్నాయి. మంగళవారం అయితే ఉష్ణోగ్రత 51 డిగ్రీలకు చేరుకుంది. ఢిల్లీతో పాటు ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానాలలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉండే అవకాశముందని భారత వాతావరణ శాఖ నిన్న హెచ్చరికలు జారీ చేసింది. 

ఢిల్లీలో బుధవారం వరకు వేడిగాలులు వీచే అవకాశముందని, రేపు, ఎల్లుండి కాస్త ఉపశమనం ఉండవచ్చునని వాతావరణ శాఖ వెల్లడించింది. రుతుపవనాలు రావడానికి మరో రెండు వారాల సమయం ఉందని... ఈ నేపథ్యంలో అప్పుడే ఎండల నుంచి ఉపశమనం ఉండకపోవచ్చునని తెలిపింది.

  • Loading...

More Telugu News