Budda Venkanna: రోజాని విచారిస్తే అసలు నిజాలు... ఆ కథ ఏమిటో మొత్తం బయటకు వస్తుంది: బుద్దా వెంకన్న

Budda Venkanna counter to Roja

  • రుషికొండలో నిర్మించింది పర్యాటక భవనాలు అన్న రోజా
  • నాడు సీఎం నివాసం కోసమని చెప్పి... ఈరోజు పర్యాటకుల కోసం అంటారా? అని బుద్దా వెంకన్న ప్రశ్న
  • రోజాని విచారిస్తే త్రీమాన్ కమిటీ కథ తెలుస్తుందని వ్యాఖ్య
  • రుషికొండ నిర్మాణాలపై ఒక్కోసారి ఒక్కో మాట మాట్లాడుతున్నారని విమర్శ

రుషికొండ నిర్మాణాలపై మాజీ మంత్రి, వైసీపీ నేత రోజా చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత బుద్దా వెంకన్న ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. 'ఏంటమ్మా రోజా' అంటూ ట్వీట్‌ను ప్రారంభించారు. నాడు రుషికొండ నిర్మాణాలు ముఖ్యమంత్రి నివాసం కోసమని, అక్కడి నుంచే పాలన అని చెప్పి... ఈరోజు పర్యాటకుల కోసం నిర్మించామని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. రోజాను విచారిస్తే అసలు నిజాలు బయటకు వస్తాయన్నారు. నాడు త్రీమాన్ కమిటీ కథ ఏమిటో కూడా బయటకు వస్తుందన్నారు.

అమరావతిలో వర్షానికి కారిపోయే భవనాలను నాడు చంద్రబాబు నిర్మించారని ఆరోపణలు చేస్తున్నారని... మరి అలాంటి భవనాల్లో ఐదేళ్లు ఉండి ఎలా పాలన చేశారో చెప్పాలన్నారు. రుషికొండలో అత్యంత నాణ్యతతో నిర్మించిన భవనాలు ఎవరి కోసం? అని నిలదీశారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత రోజాకు మతిచెడినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు.

రుషికొండ నిర్మాణాలపై ఒక్కోసారి ఒక్కో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రపతి కోసమని ఒకసారి... ప్రభుత్వానివి అని మరోసారి చెబుతున్నారని మండిపడ్డారు. అసలు రుషికొండకు బోడిగుండు చేయమని ఎవరు చెప్పారని నిలదీశారు. చేయాల్సిందంతా చేసి ఇప్పుడు నీతులు చెబుతున్నారని విమర్శించారు. వైసీపీ నేతల కబుర్లు దొరికితే దొంగ లేకుంటే దొర అన్నట్లుగా ఉందన్నారు. ప్రజల సొమ్ముతో సోకులు చేసుకోవడానికి సిద్ధమైన మీకు (వైసీపీ) ఆ ప్రజలే బుద్ధి చెప్పారన్నారు.

రుషికొండలో నిర్మించింది పర్యాటక భవనాలు అని రోజా నిన్న వెల్లడించారు. దీంతో అంతకుముందు సీఎం నివాసం కోసమని చెప్పి... ఇప్పుడు పర్యాటక భవనాలు అంటున్నారేమిటని బుద్దా వెంకన్న ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News