Hero Darshan: అభిమాని హత్య కేసు: హీరో దర్శన్ మేనేజర్ ఆత్మహత్య!

Hero Darshan manager commits suicide

  • నటి పవిత్ర గౌడతో కన్నడ హీరో దర్శన్ సహజీవనం
  • పవిత్ర గౌడకు అసభ్య సందేశాలు పంపిన దర్శన్ అభిమాని రేణుకాస్వామి
  • రేణుకాస్వామిని కిడ్నాప్ చేసి హత్య చేసినట్టు దర్శన్ పై ఆరోపణలు... అరెస్ట్
  • తాజాగా, దర్శన్ ఫాంహౌస్ లో మేనేజర్ మృతదేహం

కన్నడ చిత్ర పరిశ్రమలో ప్రముఖ హీరోగా వెలుగొందుతున్న దర్శన్ అనూహ్య రీతిలో తన అభిమానినే హత్య చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్ట్ కావడం సంచలనం సృష్టించింది. 

వివాహితుడైన దర్శన్ నటి పవిత్ర గౌడతో సహజీవనం చేస్తుండగా... తన అభిమాన హీరో కాపురంలో చిచ్చుపెడుతున్నావంటూ దర్శన్ అభిమాని రేణుకాస్వామి అనే యువకుడు పవిత్ర గౌడ సోషల్ మీడియా ఖాతాకు అసభ్య సందేశాలు పంపించాడు. దాంతో తీవ్ర ఆగ్రహం చెందిన దర్శన్ తన అభిమాని రేణుకాస్వామిని కిడ్నాప్ చేసి హతమార్చినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. 

ఈ నేపథ్యంలో, కీలక పరిణామం చోటుచేసుకుంది. హీరో దర్శన్ మేనేజర్ శ్రీధర్ ఆత్మహత్య చేసుకున్నాడు. బెంగళూరులోని దర్శన్ ఫాం హౌస్ లో శ్రీధర్ మృతదేహాన్ని గుర్తించారు. ఒంటరితనం వల్లే చనిపోతున్నట్టు శ్రీధర్ తన సూసైడ్ నోట్, వీడియో సందేశంలో పేర్కొన్నట్టు తెలుస్తోంది. తన చావుకు ఎవరూ కారణం కాదని తెలిపాడు. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. 

కాగా, దర్శన్, పవిత్ర గౌడ పదేళ్లుగా సహజీవనంలో ఉన్నట్టు సమాచారం. దర్శన్ కు అప్పటికే విజయలక్ష్మితో వివాహం జరగ్గా... పవిత్ర గౌడతో ఎఫైర్ వారి కాపురంలో కలతలు సృష్టించినట్టు జాతీయ మీడియా వెల్లడించింది. 

ఇక, 28 ఏళ్ల రేణుకాస్వామి చిత్రదుర్గ ప్రాంతానికి చెందినవాడు. దర్శన్ కు వీరాభిమాని. తన అభిమాన హీరో కాపురం కోసం ఆవేదనకు గురైన అతడు... చివరికి హత్యకు గురయ్యాడు. రేణుకాస్వామి ఎవరినైతే ఆరాధించాడో, ఆ హీరోనే అతడి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.

More Telugu News