Nara Bhuvaneswari: నేను కోరుకున్నట్టుగానే జరుగుతోంది: నారా భువనేశ్వరి

Nara Bhuvaneswari feels happy after alliance govt started ruling

  • ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి
  • అద్భుతమైన ప్రజాపాలన మొదలైందన్న నారా భువనేశ్వరి
  • ఇన్నాళ్లు అశాంతితో బతికిన ప్రజల మనసులు తేలికపడ్డాయని వెల్లడి
  • ఇక ప్రజలకు అంతా మంచే జరుగుతుందని ధీమా

ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడడం పట్ల సీఎం చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి హర్షం వ్యక్తం చేశారు. తాను కోరుకున్నట్టుగానే అద్భుతమైన ప్రజా తీర్పుతో ప్రజా పాలన మొదలైందని పేర్కొన్నారు. 

"నాడు నిజం గెలవాలి కార్యక్రమంలో ప్రజల ఆవేదన చూశాను, బాధలు విన్నాను, ఇబ్బందులు తెలుసుకున్నాను. ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ప్రజలు తామే గెలిచినంత సంతోషంలో ఉన్నారు, స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నారు, తమ అభిప్రాయాలను చెప్పగలుగుతున్నారు. నాడు తమకు జరిగిన అన్యాయాలను నిర్భయంగా ప్రస్తావిస్తూ, తాము అనుభవించిన క్షోభపై గళం విప్పుతున్నారు. 

నాడు అశాంతితో బతికిన ప్రజల మనసులు నేడు తేలికపడ్డాయి. మహిళలు తమ రక్షణపై, తల్లులు తమ బిడ్డల భవిష్యత్తుపై ధైర్యంగా ఉన్నారు. రాష్ట్ర ప్రజల ఆశలు మళ్లీ చిగురిస్తున్నాయి. ఇది నా మనసుకు ఎంతో సంతోషాన్నిచ్చింది. ఇక ప్రజలకు అంతా మంచే జరుగుతుంది. 

కూటమి ప్రభుత్వంలో, చంద్రబాబు గారి పాలనలో అమరావతి రాజధానిగా మళ్లీ గర్వంగా నిలబడుతుంది. రాజధాని రైతుల పోరాటాలు ఫలించి వారి జీవితాల్లో చీకట్లు తొలగిపోయాయి. చంద్రబాబు గారి దీక్ష, పట్టుదలతో జీవనాడి పోలవరం ప్రాజెక్టు సవాళ్లను, విధ్వంసాన్ని అధిగమించి ముందడుగు వేస్తుంది. 

ఐదు కోట్ల రాష్ట్ర  ప్రజల భాగస్వామ్యంతో ప్రతి వర్గానికి, ప్రతి ప్రాంతానికి మంచి చేయాలనే చంద్రబాబు గారి సంకల్పం నెరవేరుతుంది. ప్రాణాలు పణంగా పెట్టి పనిచేసిన పార్టీ కార్యకర్తలకు గౌరవం దక్కుతుంది. 

ప్రజలే సుప్రీం అని చాటి చెప్పిన తిరుగులేని తీర్పుతో ఇక కౌరవ సభ స్థానంలో గౌరవ సభ కొలువుదీరుతుంది. ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందన్న పూర్తి నమ్మకం నాకుంది" అంటూ నారా భువనేశ్వరి ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News