Supreme Court: నీట్ ప‌రీక్ష అవకతవకలపై సుప్రీంకోర్టులో విచార‌ణ‌.. ఎన్‌టీఏకు మొట్టికాయ‌!

Supreme Court Blasts Exam Body NTA In NEET Row

  • పరీక్ష నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ)పై సుప్రీంకోర్టు మండిపాటు
  • ఎక్క‌డైనా 0.001 శాతం నిర్లక్ష్యం ఉన్నా దానిని పూర్తిగా పరిష్కరించాల‌ని సూచ‌న‌
  • పరీక్ష నిర్వహించే ఏజెన్సీగా ఎన్‌టీఏ న్యాయంగా వ్యవహరించాలన్న అత్యున్న‌త న్యాయ‌స్థానం
  • తదుపరి విచారణ జులై 8కి వాయిదా  

దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ తదితర మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్‌ యూజీ పరీక్ష నిర్వహణలో జరిగిన అవకతవకలపై దాఖలైన పిటీషన్‌లను తాజాగా సుప్రీంకోర్టు విచారించింది. ఈ సంద‌ర్భంగా అభ్యర్థులకు దేశవ్యాప్తంగా పరీక్ష నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ)పై సుప్రీంకోర్టు మండిపడింది.

ఈ ప్ర‌క్రియ‌లో ఎక్క‌డైనా 0.001 శాతం నిర్లక్ష్యం ఉన్నా దానిని పూర్తిగా పరిష్కరించాల‌ని సుప్రీంకోర్టు పేర్కొంది. "పరీక్ష నిర్వహించే ఏజెన్సీగా మీరు న్యాయంగా వ్యవహరించాలి. పొరపాటు జరిగితే.. అవును, ఇది పొరపాటు అని చెప్పండి. కనీసం మీ పనితీరుపై విశ్వాసాన్ని కలిగిస్తుంది" అని జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ ఎస్వీఎన్ భట్‌ల‌తో కూడిన ధర్మాసనం ఎన్‌టీఏకు తెలిపింది.

దేశంలోనే అత్యంత కఠినమైన ప్రవేశ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు విద్యార్థులు ప‌డే క‌ష్టాన్ని ఏజెన్సీ మరచిపోకూడదని సుప్రీంకోర్టు పేర్కొంది. "వ్యవస్థను మోసం చేసిన వ్యక్తి డాక్టర్ అవుతాడని అనుకోండి. అప్పుడు అతను సమాజానికి మరింత హాని కలిగిస్తాడు" అని పేర్కొంది. ఈ కేసులో తదుపరి విచారణను జులై 8వ తేదీకి వాయిదా వేసింది. 

ఇదిలాఉంటే.. నీట్ ప‌రీక్ష‌లో అవకతవకలు, అక్ర‌మాల‌పై దేశ‌వ్యాప్తంగా ఆందోళ‌న‌లు కొన‌సాగుతున్నాయి. అభ్య‌ర్థులు రోడ్ల‌పైకి వ‌చ్చి త‌మ‌కు న్యాయం చేయాల‌ని కోరుతున్నారు. దేశవ్యాప్తంగా పరీక్ష నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ని ర‌ద్దు చేయాల‌ని వారు డిమాండ్ చేస్తున్నారు.

Supreme Court
NEET Exam
NTA
New Delhi
  • Loading...

More Telugu News