Virgin Airlines: విమానం ఇంజిన్‌లో మంటలు.. అలాగే ల్యాండింగ్.. వీడియో ఇదిగో!

Virgin Airlines planes engine catches fire mid air

  • క్వీన్స్‌టౌన్ నుంచి మెల్‌బోర్న్ బయలుదేరిన వర్జిన్ ఆస్ట్రేలియా విమానం
  • పక్షి ఢీకొట్టడంతో విమానం ఇంజిన్‌లో మంటలు
  • ఆ సమయంలో విమానంలో 67 మంది ప్రయాణికులు
  • విమానాన్ని ఇన్వెర్కాగిల్‌లో సేఫ్‌గా ల్యాండ్ చేసిన పైలట్

పక్షి ఢీకొట్టడంతో విమానం ఇంజిన్లలో ఒకదాంట్లో మంటలు చెలరేగాయి. అయినప్పటికీ ఏమాత్రం ఆందోళన చెందని పైలట్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. న్యూజిలాండ్‌లో జరిగిందీ ఘటన. వర్జిన్ ఆస్ట్రేలియా విమానం బోయింగ్ 737-800 మెల్‌బోర్న్ వెళ్లేందుకు న్యూజిలాండ్‌లోని క్వీన్స్‌టౌన్‌లో సోమవారం సాయంత్రం టేకాఫ్ అయింది. విమానంలో 67 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు.

విమానం టేకాఫ్ అయిన కాసేపటికే ఓ ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. పక్షి ఢీకొట్టడం వల్లే ఇలా జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఇంజిన్‌లో మంటలు చెలరేగడాన్ని గుర్తించిన పైలట్ వెంటనే అప్రమత్తమయ్యాడు. విమానాన్ని ఇన్వెర్కాగిల్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే, మండుతున్న విమానం ల్యాండ్ అవుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

విమానం ల్యాండ్ అయిన వెంటనే అప్పటికే సిద్ధంగా ఉన్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో ఎవరైనా గాయపడ్డారా? అన్న వివరాలు తెలియాల్సి ఉంది. అలాగే, ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్టు ఎయిర్‌పోర్టు అధికారి ఒకరు తెలిపారు.

  • Loading...

More Telugu News