Tirumala: రేపటి నుంచి సెప్టెంబరు నెల ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల చేయనున్న టీటీడీ

TTD will issue tickets from tomorrow onwards

  • జూన్ 18 నుంచి 20 వరకు ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్లు
  • ఈ నెల 21న ఆర్జిత సేవా టికెట్ల విడుదల
  • జూన్ 22 మధ్యాహ్నం సీనియర్ సిటిజెన్లు, దివ్యాంగుల కోటా విడుదల
  • రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను జూన్ 24వ తేదీ విడుదల

తిరుమలలో సెప్టెంబరు నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్ల కోటాను టీటీడీ రేపటి నుంచి విడుదల చేయనుంది. 

సుప్రభాతం, తోమాల సేవ, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవల టికెట్లను ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా కేటాయించనున్నారు. అందుకు గాను రేపు (జూన్ 18)  ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటలకు రిజిస్ట్రేషన్ కు అవకాశం కల్పించారు. ఈ మూడ్రోజుల్లో తమ వివరాలు నమోదు చేసుకున్న భక్తులకు ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా పలు ఆర్జిత సేవల టికెట్లు కేటాయిస్తారు. 

ఎలక్ట్రానిక్ డిప్ లో ఆర్జిత సేవా టికెట్లు పొందిన వారు జూన్ 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్దేశిత నగదు చెల్లించి టికెట్లను ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. 

ఇక, కల్యాణం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, దీపాలంకార సేవ టికెట్లను ఈ నెల 21వ తేదీన ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. ఇక కల్యాణం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, దీపాలంకార సేవల్లో వర్చువల్ గా పాల్గొనే భక్తుల కోసం జూన్ 21 మధ్యాహ్నం 3 గంటలకు కోటా విడుదల చేయనున్నారు. 

అంగప్రదక్షిణం టికెట్లను జూన్ 22న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. అదే రోజున మధ్యాహ్నం 3 గంటలకు సీనియర్ సిటిజెన్లు (వృద్ధులు), దివ్యాంగులకు ప్రత్యేక ప్రవేశ దర్శనం కోసం టికెట్లు విడుదల చేస్తారు. 

రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను జూన్ 24వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. తిరుపతి-తిరుమలలో బస చేయడం కోసం జూన్ 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు కోటా విడుదల చేస్తారు. ఈ టికెట్లను ఆన్ లైన్ లో ttdevastanams.ap.gov.in ద్వారా బుక్ చేసుకోవాల్సి ఉంటుందని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది.

Tirumala
Arjita Seva Tickets
Online
TTD
  • Loading...

More Telugu News