Bandi Sanjay: కమిషన్ ఏర్పాటే తప్పు అనుకుంటే కోర్టుకు వెళ్లొచ్చు కదా: కేసీఆర్ పై ధ్వజమెత్తిన బండి సంజయ్

Bandi Sanjay slams KCR

  • విద్యుత్ కొనుగోళ్ల అంశంపై జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ విచారణ
  • తమపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కమిషన్ వేశారన్న కేసీఆర్
  • కమిషన్ చైర్మన్ వ్యాఖ్యలు తనకు బాధ కలిగించాయంటూ లేఖ
  • కమిషన్ చైర్మన్ ను బెదిరించడం ధిక్కారం కిందకే వస్తుందన్న బండి సంజయ్

విద్యుత్ కొనుగోళ్ల అంశంపై జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కు మాజీ సీఎం కేసీఆర్ లేఖ రాయడం తెలిసిందే. తమపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ కమిషన్ వేశారని, తనపై కమిషన్ చైర్మన్ ఇష్టం వచ్చినట్టు నోరుపారేసుకున్నారని కేసీఆర్ ఆరోపించారు. పదేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన తనకు ఆ వ్యాఖ్యలు బాధ కలిగించాయని తెలిపారు. 

కాగా, కేసీఆర్ లేఖపై కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ స్పందించారు. అసలు, ఆ కమిషన్ ఏర్పాటే తప్పు అనుకుంటే కోర్టుకు వెళ్లొచ్చు కదా అని అన్నారు. కమిషన్ చైర్మన్ నే వైదొలగాలని బెదిరించడం ధిక్కారం కిందకే వస్తుందని తెలిపారు. 

జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ చట్టబద్ధంగా ఏర్పాటైందని, అటువంటి కమిషన్ ను తప్పుబట్టడం కేసీఆర్ కు సరికాదని హితవు పలికారు. తెలంగాణ ఉద్యమ వేళ జస్టిస్  నరసింహారెడ్డి ధైర్య సాహసాలను, నిబద్ధతను కొనియాడిన కేసీఆర్... ఇవాళ ఆయననే తప్పుబడుతున్నారని బండి సంజయ్ విమర్శించారు. 

కోర్టు పరిధిలో ఉన్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇష్టంవచ్చినట్టు మాట్లాడి న్యాయస్థానంతో చీవాట్లు తిన్న కేసీఆర్... తన తప్పులు, అవినీతి, అక్రమాలను కప్పి పుచ్చుకునేందుకు ఎంతకైనా తెగిస్తారని ధ్వజమెత్తారు.

Bandi Sanjay
KCR
Justice Narasimha Reddy Commission
BJP
BRS
Telangana
  • Loading...

More Telugu News