Tirumala: తిరుమల వెళ్లే సీనియర్ సిటిజన్స్ కి గుడ్ న్యూస్ ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

AP Govt announces good news to senior citizens

  • టీటీడీలో ప్రక్షాళన
  • తిరుమలలో వృద్ధులకు ప్రత్యేక దర్శనాలు
  • సీనియర్ సిటిజన్ల కోసం రెండు టైమ్ స్లాట్లు
  • ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులకు దర్శనాలు  

తిరుమల పుణ్యక్షేత్రంలో రద్దీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొన్నిసార్లు స్వామివారి దర్శనానికి 30 గంటలకు పైగా సమయం పడుతుంది. అన్ని గంటల పాటు క్యూలైన్లలో ఉండాలంటే ఎవరికైనా ఇబ్బందే. ఇక వృద్ధుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వృద్ధులకు ప్రత్యేక దర్శన సౌకర్యం ఉన్నప్పటికీ, ఆన్ లైన్ విధానం గురించి అవగాహన లేక వృద్ధులు అవస్థలు పడుతుంటారు. 

ఇప్పుడు ప్రభుత్వం మారింది. టీటీడీలో ప్రక్షాళనకు చంద్రబాబు సర్కారు నడుం బిగించింది. ఈ క్రమంలో సీనియర్ సిటిజన్లకు టీటీడీ నుంచి శుభవార్త వెలువడింది. వేంకటేశ్వరుని ఉచిత దర్శనం కోసం సీనియర్ సిటిజన్‌లకు రెండు టైమ్ స్లాట్లు ఏర్పాటు చేశారు. ఒకటి ఉదయం 10 గంటలకు, మరొకటి మధ్యాహ్నం 3 గంటలకు ఏర్పాటు చేశారు. 

అందుకోసం వృద్ధులు తమ ఫొటో ఐడెండిటీ (ఆధార్ లేక ఇతర డాక్యుమెంట్లు)తో వయస్సు రుజువును సమర్పించాలి. సంబంధిత పత్రాలను ఎస్-1 కౌంటర్‌లో సమర్పించాలి. వృద్ధులు ఎక్కువ దూరం నుంచి క్యూలైన్లలో రావాల్సిన అవసరం లేకుండా... వంతెన కింద గ్యాలరీ నుంచి, ఎలాంటి మెట్లు ఎక్కాల్సిన అవసరం లేకుండానే దైవ దర్శనానికి వెళ్లొచ్చు. 

అంతేకాదు, వృద్ధుల కోసం మంచి సీటింగ్ ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. క్యూలైన్లలో వృద్ధులకు వేడి సాంబార్ అన్నం, పెరుగు అన్నం, వేడి పాలు అందిస్తారు. క్యూలైన్లలో వృద్ధులకు ప్రతిదీ ఉచితమేనని టీటీడీ స్పష్టం చేసింది. 

వృద్ధులకు తక్కువ ధరకే రెండు లడ్డూలు అందిస్తారు. రూ.20 చెల్లించి రెండు లడ్డూలు పొందవచ్చు. అదనపు లడ్డూలు కావాలంటే, ప్రతి లడ్డూకు రూ.25 చెల్లించాల్సి ఉంటుంది. ఆలయం ఎగ్జిట్ గేట్ వద్ద ఉన్న కార్ పార్కింగ్ ప్రాంతం నుంచి, కౌంటర్ వద్ద వృద్ధులను డ్రాప్ చేయడానికి బ్యాటరీ కారు అందుబాటులో ఉంటుంది. 

ఈ ప్రత్యేక దర్శనం సమయంలో అన్ని ఇతర క్యూలు నిలిపివేస్తారు. కేవలం వృద్ధుల క్యూలైన్లనే అనుమతిస్తారు. ఎటువంటి ఒత్తిడి లేకుండా కేవలం సీనియర్ సిటిజన్ లు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. శ్రీవారి దర్శనం తర్వాత వృద్ధులు 30 నిమిషాల్లోపు ఆలయం నుంచి బయటకు రావచ్చు. 

ఇతర వివరాల కోసం టీటీడీ ప్రత్యేక హెల్ప్ లైన్ నెంబరు 08772277777 అందుబాటులోకి తీసుకువచ్చింది.

Tirumala
Senior Citizens
Darshan
TTD
AP Govt
TDP-JanaSena-BJP Alliance
  • Loading...

More Telugu News