Air India: ముంబయి-విజ‌య‌వాడ మ‌ధ్య ఎయిరిండియా డైరెక్ట్ విమాన స‌ర్వీస్‌

Air India Daily Flight Service Starts from Vijayawada to Mumbai

  • ఇక‌పై ముంబయి-విజ‌య‌వాడ మ‌ధ్య ప్రతి రోజూ విమాన స‌ర్వీస్‌
  • ఈ మేర‌కు ఎయిర్ ఇండియా కీల‌క‌ ప్ర‌క‌ట‌న
  • ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్న విమాన స‌ర్వీస్‌ 
  • ఈ స‌ర్వీస్ వెనుక మ‌చిలీప‌ట్ట‌ణం ఎంపీ బాల‌శౌరీ చొర‌వ!

ఇక నుండి విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబయికి డైరెక్ట్‌ విమాన సర్వీస్‌లు నడవ‌నున్నాయి. ఈ మేర‌కు ఎయిర్ ఇండియా తాజాగా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. విజ‌య‌వాడ‌, ముంబై మ‌ధ్య డైలీ విమాన స‌ర్వీసులు న‌డ‌ప‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. 

మ‌చిలీప‌ట్నం ఎంపీ బాల‌శౌరీ చొర‌వ వల్లే ఎయిరిండియా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఆయ‌న ఎయిర్‌పోర్టు అథారిటీ ఛైర్మ‌న్‌గా ఉన్న స‌మ‌యంలో ముంబయి, విజ‌య‌వాడ మ‌ధ్య విమాన స‌ర్వీస్ ప్రారంభించాల్సిందిగా సంబంధిత శాఖ మంత్రులు, అధికారుల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. 

ఆయ‌న కృషి ఫ‌లితంగా నేడు ఈ విమాన స‌ర్వీస్‌ను కేంద్రం ప్ర‌క‌టించింది. శ‌నివారం నుంచి విజ‌య‌వాడ‌, ముంబయి మ‌ధ్య డైలీ విమాన స‌ర్వీస్ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి జూన్‌ 15న ఎయిర్‌ ఇండియా సంస్థ 180 మంది ప్రయాణికుల సామర్థ్యం గల భారీ బోయింగ్‌ ఏ320 విమాన సర్వీసును ప్రారంభించనుంది. శ‌నివారం సాయంత్రం ఈ విమానం 5.45 గంట‌ల‌కు ముంబయి నుంచి విజ‌య‌వాడ‌కు వ‌స్తుంది. తిరిగి రాత్రి 7.10 గంట‌ల‌కు విజ‌యవాడ నుంచి ముంబయికి వెళ్ల‌నుంది.  

ఇప్ప‌టివ‌ర‌కు ఆంధ్రప్ర‌దేశ్‌ నుంచి ముంబయికి ప్రతి రోజు చాలా మంది వ్యాపార నిమిత్తం, ఇతర కార్యక్రమాలకు వెళుతూ ఉంటారు. ఇప్పటివరకు విజయవాడ నుంచి విమాన మార్గంలో ముంబయి వెళ్లాలంటే హైదరాబాద్ మీదుగా వెళ్లాల్సి వచ్చేది. మధ్యలో హైదరాబాద్‌లో ఆగి వెళ్ళాలి. దీంతో ప్రయాణ సమయం ఎక్కువ ప‌ట్టేది. అయితే, ఇప్పుడు విజయవాడ నుంచి డైలీ విమాన సర్వీసు డైరెక్ట్‌గా ముంబైకి ప్రారంభం కాబోతోంది. దీనిప‌ట్ల ఏపీ ప్ర‌జ‌లు హర్షం వ్య‌క్తం చేస్తున్నారు. 

More Telugu News