MVR Krishna Teja: తెలుగు ఐఏఎస్ అధికారి కృష్ణతేజకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభినందనలు
- కేరళలో త్రిసూర్ జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న కృష్ణతేజ
- బాలల హక్కుల పరిరక్షణలో విశేష కృషి
- కృష్ణతేజకు జాతీయ బాలల హక్కుల కమిషన్ అవార్డు
- ఆయన మరింతగా సేవలు అందిస్తూ స్ఫూర్తిగా నిలవాలన్న పవన్ కల్యాణ్
బాలల హక్కుల పరిరక్షణలో విశేష కృషి చేసిన కేరళ క్యాడర్ తెలుగు ఐఏఎస్ అధికారి కృష్ణతేజ జాతీయ పురస్కారానికి ఎంపికైన సంగతి తెలిసిందే. కృష్ణతేజ కేరళలోని త్రిసూర్ జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్నారు. బాలల హక్కుల పరిరక్షణలో త్రిసూర్ జిల్లా దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచింది. జిల్లా కలెక్టర్ కృష్ణతేజను నేషనల్ అవార్డు వరించిన నేపథ్యంలో, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు.
"జాతీయ బాలల హక్కుల కమిషన్ పురస్కారానికి ఎంపికైన ఐఏఎస్ అధికారి ఎంవీఆర్ కృష్ణతేజకు అభినందనలు. మన రాష్ట్రానికి చెందిన కృష్ణతేజ కేరళ రాష్ట్రంలో బాధ్యతలు నిర్వర్తిస్తూ ప్రజా సంక్షేమం, పేదల అభ్యున్నతికి కృషి చేస్తున్నారు.
ప్రస్తుతం త్రిసూర్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతల్లో ఉన్న ఆయన ఈ జిల్లాలో బాలల హక్కులను కాపాడేందుకు ఉత్తమ విధానాలు అనుసరించారు. కరోనా సంక్షోభం సమయంలో, కేరళ వరదల విపత్తు సమయంలో కృష్ణతేజ విధి నిర్వహణలో చూపిన అంకిత భావాన్ని ఆ రాష్ట్ర ప్రజలు మరిచిపోలేదు.
ఆయన మరింతగా సేవలు అందిస్తూ ఉద్యోగులకు, యువతకు స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షిస్తున్నాను" అంటూ పవన్ కల్యాణ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.