Jammu And Kashmir Encounter: రెచ్చిపోతున్న ఉగ్రవాదులు.. కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్
- బుధవారం రాత్రి దోడా జిల్లాలోని గాంఢో ప్రాంతంలో ఎన్‌కౌంటర్
- పోలీసుల గాలింపు చర్యల సందర్భంగా కాల్పులకు తెగబడ్డ ఉగ్రవాదులు
- ప్రతిదాడికి దిగిన భద్రతా దళాలు
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు వరుస దాడులతో రెచ్చిపోతున్నారు. తాజాగా దోడా జిల్లాలో బుధవారం మరోసారి కాల్పులకు తెగబడ్డారు. గాలింపు చర్యలు చేపడుతున్న పోలీసులపై బుధవారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో, పోలీసులు ఎదురుకాల్పులకు దిగారు. పోలీసుల కథనం ప్రకారం, జిల్లాలోని గాంఢో ప్రాంతంలోని ఓ గ్రామంలో పోలీసులు రాత్రి 7.41 గంటల సమయంలో గాలింపు చర్యలు చేపడుతుండగా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో, భద్రతా దళాలు కూడా ప్రతిదాడికి దిగాయి. ఈ క్రమంలో భారీ ఎన్‌కౌంటర్ జరిగినట్టు తెలుస్తోంది. భారీ ఎత్తున మోహరించిన పోలీసులు ఆ ప్రాంతమంతా తమ అధీనంలోకి తీసుకున్నారు. ఈ ఘటనలో కానిస్టేబుల్ ఫరీద్ అహ్మద్ కూడా గాయపడ్డారు.
అంతకుమునుపు, స్థానికంగా ఉన్న ఓ చెక్ పోస్టుపై ఉగ్రదాడిలో ఐదుగురు జవాన్లు గాయపడ్డారు. ఆ తరువాత సుమారు ఆరు గంటలకు ఉగ్రవాదులకు, పోలీసులకు మధ్య ఎన్ కౌంటర్ జరిగింది. ఉగ్రదాడి నేపథ్యంలో పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా హైవేపై వాహనరాకపోకలను నిలిపివేశారు. ఇదిలా ఉంటే ఉగ్రవాదులు భడేర్వా, థాత్రి, గాండో ప్రాంతాల్లో ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరి ఊహా చిత్రాలను కూడా విడుదల చేశారు. ఉగ్రవాదుల ఆచూకీ తెలిపిన వారికి రూ.5 లక్షల రివార్డును కూడా ప్రకటించారు.