Rahul Gandhi: వయనాడ్ లేదా రాయ్‌బరేలీ... తేల్చుకోలేకపోతున్నానన్న రాహుల్ గాంధీ
- బుధవారం మలప్పురంలో జరిగిన ర్యాలీలో పాల్గొన్న రాహుల్ గాంధీ
- ఒక నియోజక వర్గానికే ఎంపీగా ఉండాల్సి ఉంటుందని వ్యాఖ్య
- తన నిర్ణయంతో రెండు నియోజకవర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలన్న రాహుల్
వయనాడ్, రాయ్‌బరేలీలలో ఏ నియోజకవర్గంలో కొనసాగాలనేది తేల్చుకోలేకపోతున్నానని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. కేరళలోని మలప్పురంలో బుధవారం జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ... ఈ విషయంలో తానూ ఏమీ తేల్చుకోలేకపోతున్నానన్నారు. ఏమైనా తాను ఏదో ఒక నియోజకవర్గానికి మాత్రమే ఎంపీగా ఉండాల్సి ఉంటుందన్నారు. తన నిర్ణయంతో రెండు నియోజకవర్గాలు సంతోషంగా ఉండాలని కోరుకున్నారు. తనను భారీ మెజార్టీతో గెలిపించిన వయనాడ్ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
ప్రధాని మోదీపై విమర్శలు
దేశంలో విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు అదానీకి అప్పగించాలని దేవుడు ఆదేశించారా? అని ఎద్దేవా చేశారు. తాను మానవమాత్రుడినేనని... తనకు పేదలు, దేశమే దైవమన్నారు. నేనేం చేయాలో వారే చెబుతారన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత మోదీ తన వైఖరిని మార్చుకోవాల్సిందే అన్నారు. ఆయనకు ప్రజలు స్పష్టమైన సందేశం ఇచ్చారని మెజార్టీ రాకపోవడాన్ని ఉద్దేశించి అన్నారు.