Jammu And Kashmir: జమ్మూకశ్మీర్‌లో ఆర్మీ స్థావరంపై ఉగ్రదాడి

Terror attack on army camp in doda district of J and k
  • బుధవారం దోడా జిల్లాలో ఘటన
  • ఆర్మీ తాత్కాలిక స్థావరాన్ని టార్గెట్ చేసిన ఉగ్రమూకలు
  • దాడిలో ఐదుగురు సైనికులు, ఒక పోలీసు అధికారికి గాయాలు
  • భద్రతాదళాల ఎదురుకాల్పుల్లో ఒక ఉగ్రవాది మృతి
  • దాడికి తామే కారణమని ప్రకటించుకున్న కశ్మీర్ టైగర్స్

వరుస ఉగ్రదాడులతో జమ్మూకశ్మీర్‌లో కలకలం రేగుతోంది. బుధవారం దోడా జిల్లాలో ఆర్మీకి చెందిన తాత్కాలిక స్థావరంపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు సైనికులు, ఓ స్పెషల్ పోలీస్ ఆఫీసర్ గాయపడగా.. ఉగ్రవాది కూడా ఎదురుకాల్పుల్లో మృతి చెందాడు. గాయపడ్డ వారికి భడేర్వా ఎస్‌డీహెచ్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్టు ఆర్మీ వర్గాలు తెలిపాయి. ఈ దాడికి తామే బాధ్యులమని కశ్మీర్ టైగర్స్ ఉగ్రవాద మూకలు ప్రకటించుకున్నాయి. మరోవైపు, ఉగ్రవాదుల జాడ కనిపెట్టేందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గత మూడు రోజుల్లో మూడోసారి ఉగ్రవాదులు దాడులకు తెగబడటంతో స్థానికంగా ఆందోళన వ్యక్తం అవుతోంది. 

కశ్మీర్‌లో శాంతియుత వాతావరణాన్ని విచ్ఛిన్నం చేసేందుకు దాయాది దేశం ప్రయత్నిస్తోందని జమ్మూకశ్మీర్ ఏడీజీపీ ఆనంద్ జైన్ మీడియాకు తెలిపారు. ఈ దాడి కూడా అందులో భాగమేనని అన్నారు. ఒక ఉగ్రవాదిని మట్టుపెట్టామని చెప్పారు. మిగతావారి కోసం గాలిస్తున్నామని అన్నారు. 

కథువా జిల్లాలో ఇటీవలే ఓ ఇంటిపై ఉగ్రమూకలు కాల్పులకు తెగబడ్డ విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఎదురుకాల్పులకు దిగిన భద్రతాదళాలు ఓ ఉగ్రవాదిని మట్టుపెట్టాయి. అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలోని హీరానగర్ సెక్టర్‌లో ఈ ఘటన వెలుగు చూసినట్టు  కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. 

అంతకుమునుపు జూన్ 9న రైసీ జిల్లాలో కొందరు ఉగ్రవాదులు, యాత్రికులతో వెళుతున్న బస్సుపై కాల్పులకు తెగబడ్డారు. ఈ క్రమంలో బస్సు సమీపంలోని లోయలో పడిపోయింది. ఆ తరువాత కూడా ఉగ్రవాదులు తమపై కాల్పులు కొనసాగించారని బాధితులు తెలిపారు. ఈ ఘటనలో 10 మంది మృతి చెందగా 33 మంది గాయపడ్డారు. మే 4 పూంచ్ సెక్టర్ లో ఎయిర్ ఫోర్స్ కాన్వాయ్‌పై దాడి చేసిన ఉగ్రమూకలే బస్సును టార్గెట్ చేసుకుని ఉంటాయని ఆర్మీ వర్గాలు అనుమానిస్తున్నాయి.

  • Loading...

More Telugu News