Terror Attacks: జమ్మూ కశ్మీర్‌లో బస్సుపై ఉగ్రదాడి.. రంగంలోకి జాతీయ దర్యాప్తు సంస్థ

 NIA to probe massive hunt for terrorists
  • దర్యాప్తు బాధ్యతలు ఎన్ఐఏకు అప్పగించిన హోం శాఖ వర్గాలు
  • ఉగ్రమూకల కోసం ఆర్మీ, సీఆర్‌పీఎఫ్, పోలీసుల గాలింపు
  • పూంచ్, రాజోరీ సెక్టర్ల దాడులకు బాధ్యులైన ఉగ్రమూకలే ఈ దాడికి తెగబడ్డట్టు అనుమానాలు

జమ్మూ కశ్మీర్‌లో యాత్రికులతో తిరిగొస్తున్న బస్సుపై ఉగ్రదాడి నేపథ్యంలో జాతీయ దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ఈ కేసుపై దర్యాప్తును ఎన్ఐఏ‌కు అప్పగించినట్టు హోం మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. దాడి జరిగిన ప్రాంతంలో డ్రోన్లతో గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఆధారాల సేకరణకు ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ కూడా రంగంలోకి దిగింది. 

ఆదివారం సాయంత్రం రాయిసీ జిల్లాలో జరిగిన ఈ దాడిలో ఉగ్రవాదులు ఒక్కసారిగా యాత్రికులు ఉన్న బస్సుపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో, బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 10 మంది మరణించగా 33 మంది గాయాలపాలయ్యారు. బస్సు లోయలో పడిపోయినా ఓ ఉగ్రవాది మరో 20 నిమిషాల పాటు కాల్పులు కొనసాగించాడని క్షతగాత్రుల్లో ఒకరు మీడియాకు తెలిపారు. ఒకేసారి పలువురు టెర్రరిస్టులు కాల్పులకు తెగబడ్డారని, వారందరూ ముఖాలకు మాస్కులు ధరించారని అన్నారు. అయితే, ఈ దాడిలో ముగ్గురు పాల్గొని ఉండొచ్చని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. గతనెలలో రాజోరీ, పూంచ్ సెక్టర్లలో దాడులకు తెగబడ్డ ఉగ్రమూకలే బస్సును టార్గెట్ చేసినట్టు చెబుతున్నారు. ఇప్పటివరకూ ఉగ్రవాదుల ఆచూకీ దొరకలేదు. 

ఉగ్రవాదుల ఆచూకీ కనుగొనేందుకు భారీ స్థాయిలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. భారత ఆర్మీ, సీఆర్‌పీఎఫ్, పోలీసులు ఈ జాయింట్ ఆపరేషన్ లో పాలుపంచుకుంటున్నారు.

  • Loading...

More Telugu News