VK pandian: రాజకీయాల నుంచి తప్పుకున్న ఒడిశా మాజీ సీఎం సహాయకుడు వీకే పాండ్యన్

VK Pandian Quits Active Politics After BJD Loses Odisha apologises To Party Workers

  • ఒడిశాలో బీజేపీ చేతుల్లో బీజేడీ ఘోర ఓటమి 
  • ఈ ఓటమికి నవీన్ పట్నాయక్ సహాయకుడు వీకే పాండ్యన్ కారణమంటూ విమర్శలు
  • విమర్శల నేపథ్యంలో రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన పాండ్యన్

ఒడిశా ఎన్నికల్లో బిజూ జనతా దళ్ ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో పార్టీ అధినేత నవీన్ పట్నాయక్ సహాయకుడు వీకే పాండ్యన్ రాజకీయాల నుంచి తప్పుకున్నారు. నవీన్ తరువాత పార్టీలో అత్యంత ప్రముఖుడిగా పేరు పడ్డ ఆయన ఈ ఓటమికి బాధ్యత వహిస్తూ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఆయన పార్టీ కార్యకర్తలను, నేతలను ఉద్దేశిస్తూ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. 

‘‘నవీన్ బాబుకు సహాయం చేసేందుకే నేను రాజకీయాల్లో ప్రవేశించా. ఇప్పుడు నేను ఈ రంగం నుంచి తప్పుకునేందుకు నిర్ణయించుకున్నాను. ఈ ప్రయాణంలో నేను ఎవరినైనా నొప్పిస్తే క్షమాపణలు చెబుతున్నా. నాపై దుష్ఫప్రచారం పార్టీ ఓటమికి కారణం కావడం నన్ను బాధించింది. ఇంతకాలంగా నాతో కలిసి పనిచేసిన బీజే పరివారం సభ్యులందరికీ ధన్యవాదాలు. ఒడిశాకు ఎప్పటికీ నా మనసులో ప్రత్యేక స్థానం ఉంటుంది. నవీన్ బాబు నా ఊపిరి. మీరందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆ జగన్నాథుడిని ప్రార్థిస్తా’’ అని అన్నారు. దాదాపు 12 ఏళ్ల క్రితం ఒడిశా ముఖ్యమంత్రి కార్యాలయంలో తన ప్రయాణం ప్రారంభించిన పాండ్యన్ ఇది తనకు దక్కిన గౌరవమని వ్యాఖ్యానించారు. నవీన్ బాబు నుంచి తాను ఎన్నో నేర్చుకున్నానని, అవి తనకు జీవితాంతం వెన్నంటే ఉంటాయని అన్నారు. 

మరోవైపు, పాండ్యన్‌పై విమర్శలు సరికాదని అంతకుమునుపే నవీన్ పట్నాయక్  స్పష్టం చేశారు. పాండ్యన్ పార్టీ కోసం పనిచేసినా ఒక్క పదవి కూడా చేపట్టలేదని అన్నారు. ఇంతకాలం ఆయన అద్భుత పని తీరు కనబరిచారని అన్నారు. తుపానులు, కరోనా సంక్షోభ సమయంలో ఆయన ముఖ్యపాత్ర పోషించారని చెప్పారు.

  • Loading...

More Telugu News