Dr Pemmasani Chandrasekhar: గుంటూరు ఎంపీ పెమ్మసాని బయోడేటా మామూలుగా లేదు!

Guntur MP Dr Pemmasani Chandrasekhar full biodata

  • గుంటూరు లోక్ సభ స్థానంలో టీడీపీ అభ్యర్థిగా పెమ్మసాని ఘనవిజయం
  • వృత్తి రీత్యా వైద్యుడైన పెమ్మసాని చంద్రశేఖర్
  • అమెరికాలో అదిరిపోయే ట్రాక్ రికార్డు
  • ఏపీలో అనేక సేవా కార్యక్రమాలతో గుర్తింపు
  • చంద్రబాబు పిలుపు మేరకు రాజకీయాల్లోకి రాక

ఇటీవలి సార్వత్రిక ఎన్నికలు టీడీపీకి ఒక తీపి గుర్తుగా నిలిచిపోతాయి. అసెంబ్లీ ఎన్నికల్లోనూ, లోక్ సభ ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీ ప్రభంజనం సృష్టించింది. ముఖ్యంగా, పెమ్మసాని చంద్రశేఖర్ వంటి ఎన్నారై కూడా పోటీ చేసిన తొలిసారే బ్రహ్మాండమైన విజయం సాధించారంటే టీడీపీ గాలి ఏ రేంజిలో వీచిందో అర్థమవుతుంది. 

వృత్తిరీత్యా వైద్యుడైన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు లోక్ సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఘనవిజయం అందుకున్నారు. పెమ్మసానికి 3.44 లక్షల ఓట్ల భారీ మెజారిటీ లభించింది. దాంతో అందరి దృష్టి ఈ యువనేతపై పడింది. ఆయన గురించి తెలుసుకునేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. 

బుర్రిపాలెంలో పుట్టి నరసరావుపేటలో పెరిగి...

పెమ్మసాని చంద్రశేఖర్ స్వస్థలం ఉమ్మడి గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెం గ్రామం. సాంబశివరావు, సువర్చల దంపతులకు 1976 మార్చి 7న జన్మించారు. పెమ్మసాని కుటుంబానికి మొదట్లో వ్యవసాయమే ప్రధాన వృత్తిగా ఉండేది. 

కాలక్రమంలో ఆయన తండ్రి సాంబశివరావు నరసరావుపేటలో హోటల్ తెరిచి నిలదొక్కుకోవడంతో, పెమ్మసాని కుటుంబం అక్కడే స్థిరపడింది. నరసరావుపేటలో  'మాధురి' సాంబయ్య అంటే తెలియనివాళ్లు ఉండరు. ఇక, పెమ్మసాని చంద్రశేఖర్ పదో తరగతి వరకు నరసరావుపేటలోనే చదువుకున్నారు. గుంటూరులో ఇంటర్ పూర్తి చేశారు. 

ఎంసెట్ లో ర్యాంక్ ఎంతో తెలుసా...?

పెమ్మసాని చదువులో ఎప్పుడూ ముందుండే వాడు. డాక్టర్ కావాలని కలలు కన్న పెమ్మసాని చంద్రశేఖర్ ఎంసెట్ లో అదరగొట్టాడు. 1993-94లో 60 వేల మంది ఎంసెట్ రాస్తే, పెమ్మసాని 27వ ర్యాంక్ సాధించడం అతడి ప్రతిభకు నిదర్శనం. అనంతరం హైదరాబాదులోని ఉస్మానియా మెడికల్ కాలేజి నుంచి ఎంబీబీఎస్ పట్టా అందుకున్నారు. దాంతో పెమ్మసాని చంద్రశేఖర్ డాక్టర్ అయ్యారు. 

ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన పెమ్మసాని పెన్సిల్వేనియోలోని జీసింజర్ మెడికల్ కాలేజీ నుంచి పీజీ, ఇంటర్నల్ మెడిసిన్ పట్టాలు అందుకున్నారు. పీజీలో అత్యధిక మార్కులతో కాలేజి టాపర్ గా నిలిచారు. 

వరుసగా రెండేళ్ల పాటు కాలేజి అవార్డులు అందుకున్నారు. ఆ తర్వాత జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీలోని సినాయ్ హాస్పిటల్ లో ప్రొఫెసర్ గానూ, వైద్యుడిగానూ ఐదేళ్ల పాటు సేవలందించారు. 

తనలాగా ఇతరులు కష్టాలు పడకూడదని...

అమెరికాలో వైద్య సేవలు అందించేందుకు లైసెన్సింగ్ పరీక్షలోనూ ఉత్తీర్ణుడయ్యారు. ఈ పరీక్ష కోసం సన్నద్ధమయ్యే సమయంలో పెమ్మసాని అనేక కష్టాలు ఎదుర్కొన్నారు. సరైన మెటీరియల్ లేక, వసతి సదుపాయాలు దొరక్క అనేక ఇబ్బందులు పడ్డారు. 

అయితే, అమెరికాలో మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామ్ (యూఎస్ఎంఎల్ఈ) కోసం వచ్చే విదేశీ విద్యార్థులు తనలాగా కష్టాల పాలవకూడదని భావించిన పెమ్మసాని... ట్రైనింగ్ మెటీరియల్ ను అంతా కలిపి ఒకే పుస్తకంగా రూపొందించారు. ఆ పుస్తకం ధరను కూడా నామమాత్రంగానే నిర్ణయించారు. ఈ పుస్తకం అమెరికాలో వైద్య విద్యను అభ్యసించే విద్యార్థులకు ఒక విలువైన ఆస్తిగా మారింది. అప్పటికి పెమ్మసాని చంద్రశేఖర్ వయసు కేవలం 25 ఏళ్లే. 

పెమ్మసాని పుస్తకంతోనే సరిపెట్టకుండా... 'యూఎస్ఎంఎల్ఈ' కోసం సన్నద్ధమ్యే విద్యార్థులకు ఆన్ లైన్ లో శిక్షణ ఇచ్చేందుకు 'యూ వరల్డ్' పేరిట ఓ వేదిక స్థాపించారు. దీనిద్వారా ఎంతోమంది విదేశీ విద్యార్థులు 'యూఎస్ఎంఎల్ఈ' గట్టెక్కేందుకు తోడ్పాటు అందించారు. 'యూ వరల్డ్' తో అమెరికా అంతటా పెమ్మసాని పేరు మార్మోగిపోయింది. ప్రస్తుతం 'యూ వరల్డ్' సంస్థ డాక్టర్ లైసెన్సింగ్ ఎగ్జామ్ శిక్షణ మాత్రమే కాకుండా... నర్సింగ్, ఫార్మసీ, ఫైనాన్స్, లా, కామర్స్, అకౌంటింగ్ రంగాల్లోనూ శిక్షణ ఇస్తోంది. 

పల్నాడులోనూ పెమ్మసాని సేవలు

కాలక్రమంలో డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తన మంచి మనసును చాటుకుంటూ, తన సేవలను మరింత విస్తరించారు. అమెరికాలో ఆరోగ్య బీమాలేని ఎన్నారైలకు తన పెమ్మసాని ఫౌండేషన్ ద్వారా ఆరోగ్య సేవలు అందిస్తున్నారు. ఈ ఫౌండేషన్ డాలస్ లో ఉంది. 

తాను పెరిగిన గడ్డపై మమకారంతో పల్నాడు ప్రాంతంలో 100 బోర్లు తవ్వించారు. తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో ఆర్వో మినరల్ వాటర్ ప్లాంట్లు, మంచి నీటి ట్యాంకులు నిర్మించారు. 2010 నుంచే ఆయన రాష్ట్రంలో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. 

అంతేకాదు పెమ్మసాని ఫౌండేషన్ ద్వారా ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్ షిప్ లు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం సమయంలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద అనేక రకాల సేవలు అందించారు. 

వెతుక్కుంటూ వచ్చిన అవార్డులు, సభ్యత్వాలు

అమెరికాలో ఉన్నప్పుడు పెమ్మసానిని పలు అవార్డులు వరించాయి. 2020లో నార్త్ టెక్సాస్ ఏరియాలో ఆంట్రప్రెన్యూర్ ఆఫ్ ద ఇయర్ సౌత్ వెస్ట్ రీజియన్ అవార్డు లభించింది. ఏఎస్ యూ-జీఎస్వీ 150 సమ్మిట్ పురస్కారంతో పాటు, మీడియా సంస్థల నుంచి ఎన్నో అవార్డులు స్వీకరించారు. 

అమెరికాలో అనేక ప్రతిష్ఠాత్మక సంస్థలు ఆయనకు సభ్యత్వాన్ని ఆఫర్ చేశాయి. డాక్టర్ పెమ్మసాని ప్రపంచ ప్రఖ్యాత ఫోర్బ్స్ బిజినెస్ కౌన్సిల్ లో సభ్యుడిగా ఉన్నారు. భారత సంతతి అమెరికా వైద్యుల సంఘంలోనూ సభ్యత్యం ఉంది. 

చంద్రబాబు పిలుపుతో పొలిటికల్ ఎంట్రీ 

ఇక, తెలుగుదేశం పార్టీ ఎన్నారై విభాగంలో పెమ్మసాని చాలా చురుగ్గా కొనసాగుతున్నారు. తన ఆదాయంలో చాలా వరకు టీడీపీకి విరాళంగా ఇచ్చారు. అనేక సందర్భాల్లో పార్టీ కోసం నిధులు సేకరించి తన అభిమానాన్ని చాటుకున్నారు. 

పెమ్మసాని నిబద్ధతను గుర్తించిన టీడీపీ అధినాయకుడు చంద్రబాబు క్రియాశీలక రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించారు. రాజకీయాల్లోకి రావడం, గుంటూరు టీడీపీ టికెట్ అందుకోవడం, భారీ మెజారిటీతో విజయం సాధించి, కేంద్రంలోనూ సహాయమంత్రి పదవిని అందుకోవడం చకచకా జరిగిపోయాయి.

లేడీ డాక్టర్ తో పెళ్లి...

సహజంగానే డాక్టర్లు తమ వృత్తిలో ఉండేవారిని పెళ్లి చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కూడా లేడీ డాక్టర్ శ్రీరత్న కోనేరును వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం పెమ్మసాని వయసు 48 ఏళ్లు.

  • Loading...

More Telugu News