Disembowelment: ఒకేసారి దగ్గు, తుమ్ము.. పొట్టపగిలి పేగులు బయటకు..!

Florida man suffers disembowelment after cough and sneeze
  • అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ఘటన
  • బాధితుడికి గతంలో ఉదరభాగంలో ఆపరేషన్, గాయం పూర్తిగా మానని వైనం
  • ఇటీవల భోజనం చేస్తుండగా దగ్గు, తుమ్ము రావడంతో అనూహ్య ప్రమాదం
  • ఆపరేషన్ జరిగిన ప్రాంతంలో చీలికతో పేగులు బయటకొచ్చిన వైనం
  • మరో ఆపరేషన్ చేసి బాధితుడిని కాపాడిన వైద్యులు

అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రానికి చెందిన ఓ వృద్ధుడు అనూహ్య ప్రమాదాన్ని ఎదుర్కొన్నారు. ఒకేసారి తుమ్మూ, దగ్గూ రావడంతో ఆయన పొట్ట చిట్లి పేగులు బయటకు వచ్చాయి. వెంటనే ఆసుపత్రికి తరలించగా వైద్యులు శస్త్రచికిత్స చేసి ఆయనను కాపాడారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం, వృద్ధుడికి అంతకుమునుపే ఉదర భాగంలో ఆపరేషన్ జరిగింది. ఈ క్రమంలో వైద్యులు ఉదరంపై కోతపెట్టి ఆపరేషన్ చేశారు. అనంతరం గాయానికి కుట్లు వేశారు. ఆపరేషన్ తాలుకు గాయం నుంచి వృద్ధుడు పూర్తిగా కోలుకోలేదు. 

ఇటీవల ఓ రెస్టారెంట్‌లో ఆయన భోజనం చేస్తుండగా ఉదరభాగంపై తడిగా ఉన్నట్టు అనిపించింది. ఈలోపు తుమ్మూ, దగ్గు రావడంతో ఆపరేషన్ గాయం ఉన్న చోట కడుపు చిట్లి పేగులు బయటకు వచ్చాయి. తీవ్ర నొప్పితో బాధపడుతున్న ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. 

ఉదరం, పొత్తికడుపు భాగంలో ఆపరేషన్లు అయిన వారికి ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఆపరేషన్ తాలూకు గాయాలు మానకపోతే తుమ్మూ, దగ్గుతో ఈ పరిస్థితి ఎదురవుతుందని చెబుతున్నారు. శస్త్రచికిత్సల తరువాత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. గాయాలు మానకపోతే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

  • Loading...

More Telugu News