Rahul Gandhi: నీ చెల్లిగా నాకు గర్వంగా ఉంది.. రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ ప్రియాంక గాంధీ భావోద్వేగం

Priyanka Gandhi says that I am proud to be your sister to Rahul Gandhi

  • ప్రత్యర్థులు ఎన్ని మాటలు అన్నా రాహుల్ గాంధీ నిలబడే ఉన్నాడన్న ప్రియాంక గాంధీ
  • హృదయంలో ప్రేమ, సత్యం, దయతో పోరాడావంటూ ప్రశంసలు
  • నిన్ను గుర్తించనివారికి ఇప్పుడు కనిపిస్తావంటూ ట్వీట్

లోక్‌సభ ఎన్నికలు-2024 ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ అంచనాలకు మించి పుంజుకుంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 52 స్థానాలకు పరిమితమైన హస్తం పార్టీ ఈసారి ఏకంగా 99 సీట్లు దక్కించుకుంది. మంగళవారం వెలువడిన ఫలితాలు ఆ పార్టీ కేడర్‌లో పునరుత్తేజం నింపాయని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా ‘భారత్ జోడో’ చేపట్టిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ప్రశంసల జల్లు కురుస్తోంది. రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ ఆయన సోదరి ప్రియాంక గాంధీ కూడా భావోద్వేగంగా స్పందించారు. 

‘‘రాహుల్ గాంధీ చెల్లెలిగా నాకు గర్వంగా ఉంది’’ అంటూ బుధవారం ఎక్స్ వేదికగా ఆమె స్పందించారు. ‘‘ ప్రత్యర్థులు ఎన్ని మాటలు అన్నా, వాళ్లు ఏం చేసినా నువ్వు నిలబడే ఉన్నావు. ఎన్ని కష్టాలు ఎదురైనా నువ్వు వెనుకడుగు వేయలేదు. దృఢంగా నిలబడ్డ నీపై ఎన్ని సందేహాలు వ్యక్తం చేసినా నువ్వు విశ్వాసాన్ని కోల్పోలేదు. దురుద్దేశంతో విపరీతమైన అసత్యాలు ప్రచారం చేసినా నిజం కోసం నీ పోరాటం ఆపలేదు. నీ మీద వెదజల్లిన విద్వేషం, కోపానికి నువ్వు చోటు ఇవ్వలేదు. ప్రత్యర్థులు ప్రతి రోజూ విద్వేషాన్ని ప్రదర్శించినా.. నీ హృదయంలో ప్రేమ, సత్యం, దయతో పోరాడావు. నిన్ను గుర్తించలేని వాళ్లు ఇప్పుడు చూస్తారు. మాలోని కొందరం నిన్ను ఎప్పుడూ చూస్తూనే ఉన్నాం. నువ్వు అందరికంటే ధైర్యవంతుడవని తెలుసుకున్నాం’’ అంటూ ట్వీట్‌లో ప్రియాంక గాంధీ పేర్కొన్నారు.

More Telugu News