Indore: ఇండోర్‌లో రెండు సంచలనాలు.. అత్యధిక మెజారిటీ, నోటాకు అత్యధిక ఓట్లు!
- బీజేపీ అభ్యర్థి శంకర్ లల్వానీ 10 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపు
- నోటాకు రికార్డు స్థాయిలో 2 లక్షలకు పైగా ఓట్లు
- గతంలో బీహార్‌లోని గోపాల్‌గంజ్‌లో నోటాకు 51 వేల ఓట్లు
- ఆఖరి నిమిషంలో బరిలోంచి వైదొలిగిన కాంగ్రెస్ అభ్యర్థి అక్షయ్ కాంతి
- దీంతో కాంగ్రెస్ మద్దతుదారులు నోటాకు ఓట్లేసిన వైనం
ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ లోక్‌సభ స్థానం సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది. కాంగ్రెస్ అభ్యర్థి అక్షయ్ కాంతి చివరి నిమిషంలో వైదొలగడంతో అక్కడ రెండు సంచలన రికార్డులు నమోదయ్యాయి. ఆ స్థానం నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి శంకర్ లల్వానీ 10 లక్షల ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఇప్పటివరకు ఇదే అత్యధిక మెజారిటీ రికార్డు. ఇదొక రికార్డు కాగా, నోటాకు అత్యధికంగా ఓట్లు పడిన స్థానంగా కూడా ఇండోర్ నిలిచింది. ఈసారి నోటాకు రికార్డు స్థాయిలో 2 లక్షలకు పైగా ఓట్లు పడ్డాయి.
ఇక ఇండోర్ లోక్‌సభ స్థానానికి మే 13న ఎన్నికలు జరిగాయి. బీజేపీ నుంచి సిటింగ్ ఎంపీ శంకర్ లల్వానీ బరిలో నిలిచారు. అటు కాంగ్రెస్ అభ్యర్థిగా అక్షయ్ కాంతి పోటీకి దిగారు. అయితే ఆఖరి నిమిషంలో ఏప్రిల్ 29వ తేదీన అక్షయ్ పోటీ నుంచి వైదొలిగి, బీజేపీలో చేరిపోయారు. దీంతో అక్కడ కాంగ్రెస్ పోటీలో లేకుండా పోయింది. ఇక కాంగ్రెస్ పార్టీ సూచన మేర మద్దతుదారులు నోటాకు ఓట్లేశారు. ఫలితంగా శంకర్ లల్వానీకి 12 లక్షల ఓట్లు దక్కగా, నోటాకు 2.1 లక్షల ఓట్లు వచ్చాయి.
రెండో స్థానంలో బహుజన్ సమాజ్‌వాద్ పార్టీ నేత సంజయ్ కేవలం 51 వేల ఓట్లు మాత్రమే దక్కించుకున్నారు. ఆయన కంటే నోటాకే 1.5 లక్షల ఓట్లు ఎక్కువగా వచ్చాయి. గతంలో బీహార్‌లోని గోపాల్‌గంజ్‌లో నోటాకు 51 వేల ఓట్లు వచ్చాయి. ఇప్పటివరకు అదే రికార్డు. ఇప్పుడు ఇండోర్ ఫలితం ఆ రికార్డును దాటేసింది.