Raghunandan Rao: హరీశ్ రావు, కేసీఆర్ నియోజకవర్గాల్లోనూ బీజేపీ హవా... ముందంజలో రఘునందన్ రావు
- 2004 నుంచి మెదక్‌లో బీఆర్ఎస్ పార్టీదే హవా
- మూడో స్థానానికి పడిపోయిన బీఆర్ఎస్
- 32వేల పైచిలుకు ఓట్లతో ముందంజలో బీజేపీ అభ్యర్థి
బీఆర్ఎస్ పార్టీకి మెదక్ లోక్ సభ నియోజకవర్గం కంచుకోట. 2004 నుంచి ఇక్కడి బీఆర్ఎస్ పార్టీయే గెలుస్తూ వస్తోంది. 2004లో ఆలె నరేంద్ర, 2009లో విజయశాంతి, 2014లో కేసీఆర్, 2014 ఉప ఎన్నికలు, 2019లో కొత్త ప్రభాకర్ రెడ్డి వరుసగా విజయం సాధించారు. కానీ ఈసారి కంచుకోటలో బీఆర్ఎస్‌కు భారీ షాక్ తగిలింది. ఏకంగా మూడో స్థానానికి పడిపోయింది.
బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు 33,323 ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉన్నారు. రఘునందన్ రావు 4,20,709 ఓట్లతో ఉన్నారు. రెండోస్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నీలం ముదిరాజ్ 3.87 లక్షల ఓట్లతో కొనసాగుతున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి 3.62 లక్షల ఓట్లతో మూడోస్థానంలో కొనసాగుతున్నారు.
మెదక్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలో బీఆర్‌ఎస్ అగ్రనేతలు కేసీఆర్ (గజ్వేల్), హరీశ్ రావు (సిద్దిపేట) అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడా బీజేపీయే ముందంజలో ఉంది. హరీశ్ రావు సొంత నియోజకవర్గంలో బీజేపీ ముందంజలో ఉండగా, గజ్వేల్‌లో బీఆర్ఎస్‌కు గట్టి పోటీని ఇస్తోంది. కేవలం దుబ్బాకలో మాత్రమే బీఆర్ఎస్‌కు కొంత సానుకూలత కనిపిస్తోంది. జహీరాబాద్ లోక్ సభలోనూ బీఆర్ఎస్ మూడోస్థానానికి పడిపోయింది.