Bihar: బీహార్ లో బాలుడి సమయస్ఫూర్తి.. తప్పిన రైలు ప్రమాదం

Bihar boy quick wit avert major train mishap
  • స్నేహితులతో కలసి వస్తుండగా షాబాజ్ కు కనిపించిన విరిగిన పట్టా
  • అదే సమయంలో వస్తున్న హౌరా–కథ్ గోడమ్ ఎక్స్ ప్రెస్
  • వెంటనే తన మెడలోని ఎర్ర టవల్ ను ఊపుతూ లోకోపైలట్ కు ప్రమాద సంకేతం ఇచ్చిన బాలుడు
  • ఆగిన రైలు.. మరమ్మతుల అనంతరం తిరిగి ప్రయాణం
బీహార్ లోని సమస్తిపూర్ లో ఓ బాలుడు తన సమయస్ఫూర్తితో భారీ రైలు ప్రమాదాన్ని నివారించాడు. తద్వారా ప్రయాణికులకు ప్రాణనష్టం తప్పించాడు. ప్రమాదాన్ని నివారించిన వైనాన్ని బాలుడు మీడియాతో మాట్లాడిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దీంతో నెటిజన్లు అతనికి జేజేలు పలుకుతున్నారు. 

సమస్తిపూర్ జిల్లాలోని భోలా టాకీస్ గుమ్తీ ప్రాంతంలో నివసించే 12 ఏళ్ల మొహమ్మద్ షాబాజ్ తన స్నేహితులతో కలసి ముజఫర్ పూర్ రైల్వే ట్రాక్ మీదుగా నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఓ చోట రైలు పట్టాలు విరిగినట్లు గుర్తించాడు. అదే సమయంలో ఆ ట్రాక్ పై హౌరా–కథ్ గోడమ్ ఎక్స్ ప్రెస్ రైలు వస్తుండటాన్ని గమనించాడు. విరిగిన పట్టాలపై రైలు ప్రయాణిస్తే భారీ ప్రమాదం జరుగుతుందని ఊహించాడు. 

ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే తన మెడలోని ఎర్ర టవల్ ను ఊపుతూ రైలుకు ఎదురుగా పరిగెత్తాడు. దీన్ని గమనించిన లోకో పైలట్ వెంటనే ఎమర్జెన్సీ బ్రేక్ వేశాడు. దీంతో రైలు ఒక్కసారిగా ఆగిపోయింది. రైల్వే సిబ్బంది కిందకు దిగి చూడగా పట్టా విరిగినట్లు కనిపించింది. దీంతో బాలుడిని అభినందించిన అధికారులు వెంటనే ట్రాక్ మరమ్మతులు పూర్తి చేసి రైలును పంపించారు. 

ఇందుకు సంబంధించిన వివరాలను షాబాజ్ స్థానిక మీడియాకు తెలియజేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లంతా బాలుడి సాహసాన్ని మెచ్చుకుంటున్నారు. షాబాజ్ కు ప్రధానమంత్రి బాల పురస్కారాన్ని ప్రదానం చేయాలని కోరుతున్నారు. మరోవైపు బాలుడి సమయస్ఫూర్తిని మెచ్చుకుంటూ స్థానిక నేతలు షాబాజ్ కు చిరు సత్కారం చేశారు.
Bihar
Samastipur
Railway track
Broken
Boy
Waves
Red Towel
Averts
Accident

More Telugu News