Sajjala Ramakrishna Reddy: వైసీపీ శ్రేణులు సంబరాలకు సిద్ధంగా ఉండాలి: సజ్జల
- ఏపీలో రేపు ఓట్ల లెక్కింపు
- చంద్రబాబు ఎక్కడా మాట్లాడడం లేదన్న సజ్జల
- లోకేశ్ దేశంలోనే ఉన్నాడా, లేదా అంటూ వ్యాఖ్యలు
రేపు ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఒకవేళ టీడీపీ వాళ్లు అధికారంలోకి వస్తారనుకుంటే, ఈ రెండ్రోజులు సంయమనంతో ఉంటే సరిపోతుందని, కానీ వాళ్లు ఏదో రకంగా హడావిడి చేయాలన్నట్టుగా వ్యవహరిస్తున్నారని సజ్జల విమర్శించారు. ఇష్టం వచ్చినట్టు రాతలు రాస్తున్నారని, లేఖలు ఇస్తున్నారని వ్యాఖ్యానించారు.
ఇక, రేపు కౌంటింగ్ రోజున వైసీపీ ఏజెంట్లందరూ అప్రమత్తంగా ఉండాలని సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి స్పష్టం చేశారు. కౌంటింగ్ పూర్తయి, ఫలితంపై డిక్లరేషన్ తీసుకునేంతవరకు ఏజెంట్లు అక్కడ్నించి కదలొద్దని అన్నారు.
రేపు ఉదయం 11 గంటల కల్లా ఫలితాల ట్రెండ్ అర్థమైపోతుందని, వైసీపీ శ్రేణులు సంబరాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఎవరెన్ని అపోహలు సృష్టించినా, రేపు వైసీపీ విజయం సాధించడం ఖాయమని సజ్జల ఉద్ఘాటించారు.
"కానీ మీరు గమనించారో లేదో... చంద్రబాబునాయుడు మాత్రం సైలెంట్ గా ఉన్నాడు. ఆయన మాత్రం ఎక్కడా మాట్లాడడం లేదు. చాలా గుంభనంగా వ్యవహరిస్తున్నాడు. బహుశా రేపు కౌంటింగ్ రోజున ఫలితాలు ఎలా వస్తాయో ఆయనకు అర్థమై ఉంటుంది. అందుకోసం మానసికంగా సిద్ధమైనట్టున్నాడు. ఇక లోకేశ్ దేశంలోనే ఉన్నట్టు లేడు... ఇవాళ వచ్చాడా... ఇన్నాళ్లు ఇక్కడ ఉన్నట్టు లేడు.
నిన్న ఇండియా టుడే- మై యాక్సిస్ ఎగ్జిట్ పోల్ లో పొంతన లేని అంకెలు చూసి అందరూ నవ్వుకుంటున్నారు. జనసేన 7 శాతం ఓట్ షేర్ తో 21 అసెంబ్లీ స్థానాల్లోనూ గెలుస్తుందని అందులో పేర్కొన్నారు. అదేమైనా నమ్మే విధంగా ఉందా? లోక్ సభ స్థానాల్లో మాకు 2 నుంచి 4 వస్తాయని ఎంతో ఉదార స్వభావంతో తెలియజేశారు. కేంద్రంలో ఎన్డీయేకి 400 మార్కు అందించాలన్న ఉద్దేశంతోనే ఆ ఎగ్జిట్ పోల్ లో స్థానాల సర్దుబాటు చేసినట్టు అర్థమవుతోంది" అని సజ్జల వివరించారు.