Arvind Kejriwal: తీహార్ జైలు అధికారుల ముందు కేజ్రీవాల్ సరెండర్
- ముగిసిన కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ గడువు
- నేడు తీహార్ జైల్లో లొంగిపోయిన ఢిల్లీ సీఎం
- ఈడీ అభ్యర్థన మేరకు కోర్టు జూన్ 5 వరకూ కేజ్రీవాల్‌కు జుడీషియల్ కస్టడీ పొడిగింపు
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్..మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో నేడు తీహార్ జైలు అధికారుల ముందు సరెండర్ అయ్యారు. అంతకుమునుపు, కేజ్రీవాల్ జుడీషియల్ కస్టడీ కోరుతూ ఈడీ రౌస్ ఎవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై కోర్టు తాజాగా కేజ్రీవాల్ కు జూన్ 5 వరకూ జుడీషియల్ కస్టడీ విధించింది. సరెండర్ తరువాత కేజ్రీవాల్ కు వైద్య పరీక్షలు నిర్వహిస్తారని సమాచారం. ఆయన షుగర్, బీపీలను రికార్డు చేయనున్నారు.
అంతకుమునుపు కేజ్రీవాల్ రాజ్ ఘాట్ వద్ద జాతిపిత మహాత్మాగాంధీకి నివాళులు అర్పించారు. అనంతరం, కన్నాట్ ప్లేస్ లోని హనుమాన్ దేవాలయాన్ని సందర్శించారు. మీడియాతో కూడా మాట్లాడిన కేజ్రీవాల్.. మోదీపై మరోసారి విమర్శలు గుప్పించారు. తాను నియంతృత్వానికి వ్యతిరేకంగా గొంతెత్తినందుకే మళ్లీ జైలుకెళ్లాల్సి వస్తోందని అన్నారు. ఈ కేసులో పోలీసులు 500 ప్రదేశాల్లో రెయిడ్లు నిర్వహించినా ఒక్క పైసా కూడా రికవర్ చేయలేకపోయారని అన్నారు.
ఎగ్జిట్ పోల్స్ అంచనాలపై కూడా స్పందించిన కేజ్రీవాల్ అవన్నీ అవాస్తవాలని అన్నారు. ‘‘రాజస్థాన్ లో 25 సీట్లు ఉండగా ఓ ఎగ్జిట్ పోల్ బీజేపీకి 33 సీట్లు వస్తాయని అంచనా వేసింది. అయితే, అసలు ఫలితాలకు ఇంకా మూడు రోజులే సమయం ఉండగా ఫేక్ ఎగ్జిట్ పోల్స్ ఎందుకు వస్తున్నాయనేదే అసలు ప్రశ్న. దీని వెనక ఎన్నో వాదనలు ఉండగా.. బీజేపీ ఈవీఎమ్‌లను మానిప్యులేట్ చేయనుందనేది ప్రధాన వాదన’’ అని ఆయన అన్నారు .