ACB: కేసు మూసివేతకు రూ. 3 లక్షల డిమాండ్.. లంచం తీసుకుంటూ దొరికిన కుషాయిగూడ సీఐ, ఎస్సై

ACB Arrested Kushaiguda CI And SI For Taking Bribe

  • ఓ మహిళతో బాధితుడికి స్థల వివాదం
  • ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు
  • హైకోర్టును ఆశ్రయించిన బాధితుడు
  • కేసు మూసివేసేందుకు లంచం డిమాండ్
  • తీసుకుంటూ పట్టుబడిన మధ్యవర్తి
  • అతడిచ్చిన సమాచారంతో సీఐ, ఎస్సై అరెస్ట్

నమోదైన కేసును మూసివేసేందుకు డబ్బులు డిమాండ్ చేసి రూ. 3 లక్షలు లంచం తీసుకుంటూ సీఐ, ఎస్సై, మరో వ్యక్తి  రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు. హైదరాబాద్‌లోని కుషాయిగూడలో జరిగిందీ ఘటన. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. కుషాయిగూడలోని వాసవి శివనగర్‌ కాలనీలో స్థలం విషయంలో ఓ మహిళకు, స్థానికంగా నివసించే సింగిరెడ్డి భరత్‌రెడ్డికి మధ్య వివాదం నడుస్తోంది. 

మహిళ ఫిర్యాదుతో ఏప్రిల్‌లో భరత్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తనపై అన్యాయంగా కేసు నమోదు చేశారంటూ భరత్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో 41 ఏ సీఆర్‌పీసీ కింద నోటీసులు ఇచ్చిన పోలీసులు కేసు మూసివేసేందుకు రూ. 3 లక్షలు డిమాండ్ చేశారు. ఈ మొత్తంలో కొంత సీఐ జి. వీరస్వామికి ఇవ్వాల్సి ఉంటుందని ఎస్సై షేక్ షఫీ చెప్పారు. కుషాయిగూడకే చెందిన ఉపేందర్ ఈ విషయంలో మధ్యవర్తిగా వ్యవహరించాడు. 

పోలీసుల తీరుపై భరత్ రెడ్డి ఏసీబీని ఆశ్రయించారు. నిన్న ఈసీఐఎల్‌లోని భరత్ ఆఫీసులో ఉపేందర్ రూ. 3 లక్షల నగదు తీసుకుంటుండగా మాటువేసిన ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇన్‌స్పెక్టర్ వీరస్వామి, ఎస్సై షఫీ చెప్పడంతోనే తాను డబ్బు తీసుకున్నట్టు చెప్పడంతో ఏసీబీ అధికారులు వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం రాత్రి వరకు కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌లో సోదాలు నిర్వహించారు.

  • Loading...

More Telugu News