Prajwal Revanna: ఎట్టకేలకు భారత్‌కు తిరిగొచ్చిన ప్రజ్వల్ రేవణ్ణ.. ఎయిర్ పోర్టులో అరెస్టు!

Prajwal Revanna Returns From Germany Arrested In Sex Crimes Case

  • లైంగిక దౌర్జన్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీయూ నేత ప్రజ్వల్ రేవణ్ణ
  • గురువారం అర్ధరాత్రి జర్మనీ నుంచి ఇండియాకు వచ్చిన వైనం 
  • బెంగళూరు కెంపెగౌడ విమానాశ్రయంలో అరెస్టు 

లైంగిక దౌర్జన్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక జేడీయూ నాయకుడు, మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. జర్మనీ నుంచి బయలుదేరిన ఆయన గురువారం అర్ధరాత్రి బెంగళూరు కెంపెగౌడ విమానాశ్రయంలో దిగగానే అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆరోపణలు వెలుగులోకి రాకమునుపే ప్రజ్వల్ జర్మనీకి వెళ్లిపోయారు. ఆ తరువాత భారత్ కు తిరిగి రావడంలో తాత్సారం చేశారు. చివరకు మాజీ ప్రధాని దేవెగౌడ ప్రజ్వల్ రేవణ్ణకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. భారత్ కు వచ్చి దర్యాప్తునకు సహకరించకపోతే తన ఆగ్రహాన్ని చవి చూడాలని హెచ్చరించారు. దీంతో, ప్రజ్వల్ దిగొచ్చాడు. 

మరోవైపు, ప్రజ్వల్ రేవణ్ణ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ప్రత్యేక కోర్టు గురువారం తిరస్కరించింది. ఇక హసన్ లో ఉన్న ప్రజ్వల్ ఇంట్లో పోలీసులు తనఖీలు నిర్వహించి పలు ఆధారాలు సేకరించారు. 

ఇదిలా ఉంటే..తాత వార్నింగ్ అనంతరం ప్రజ్వల్ సోమవారం తన తల్లిదండ్రులను ఉద్దేశిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. వారికి క్షమాపణలు చెప్పడమే కాకుండా ప్రతిపక్షాల విమర్శలతో తాను డిప్రెషన్ లో ఉన్నట్టు చెప్పుకొచ్చాడు. మే 31న పోలీసుల ముందు హాజరవుతానని, దర్యాప్తునకు సహకరిస్తానని అన్నాడు. తనకు దేవుడి ఆశీర్వాదం ఉందని చెప్పుకొచ్చాడు. 

ఇక ప్రజ్వల్ కాంట్రవర్సీకి బీజేపీ దూరం జరిగింది. ఇది పార్టీకి సంబంధించిన విషయం కాదని, తాము ఎటువంటి వ్యాఖ్యా చేయబోమని పేర్కొంది. మరోవైపు, ప్రజ్వల్ రేవణ్ణపై లైంగిక ఆరోపణల గురించి జేడీఎస్ కు ముందే తెలుసని పార్టీ నేత ఒకరు చెప్పడం ఇబ్బందులకు దారి తీసింది. లైంగిక దౌర్జన్యం ఆరోపణలు వెలుగు చూసిన ఆరు రోజుల తరువాత.. ఏప్రిల్ 27న ప్రజ్వల్ తన డిప్లొమేటిక్ పాస్ పోర్టు ఆధారంగా జర్మనీ వెళ్లిపోయిన విషయం తెలిసిందే. నిజం త్వరలో బయటకు వస్తుందని అప్పట్లో ఎక్స్ వేదికగా ఆయన ట్వీట్ చేశాడు.

  • Loading...

More Telugu News