Pinnelli Ramakrishna Reddy: 'పిన్నెల్లి పైశాచికం' పేరిట పుస్తకం విడుదల చేసిన టీడీపీ

TDP releases book on Pinnelli

  • ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని పిన్నెల్లి పైశాచికత్వానికి పాల్పడ్డారని ఆగ్రహం
  • మాచర్లలో పేట్రేగిన వారికి త్వరలోనే బుద్ధి చెబుతామని హెచ్చరిక
  • మాచర్ల ప్రజల చేతిలోనే పిన్నెల్లికి బడితపూజ తప్పదని వ్యాఖ్య
  • పిన్నెల్లిని మాచర్ల నుండి బహిష్కరించాలని డిమాండ్
  • జగన్ రెడ్డి అండ చూసుకునే పిన్నెల్లి దుర్మార్గాలు పెచ్చుమీరాయన్న టీడీపీ నేతలు

ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దారుణాలకు పాల్పడ్డారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాచర్ల ఎమ్మెల్యే అరాచకాలు, దోపిడీ విధానాలంటూ 'పిన్నెల్లి పైశాచికం' అనే పేరుతో టీడీపీ బుధవారం ఓ పుస్తకాన్ని విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో దేవినేని ఉమామహేశ్వర రావు, బుద్ధా వెంకన్న, అశోక్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రభుత్వం అండ చూసుకొని పిన్నెల్లి పైశాచికత్వం తారస్థాయికి చేరిందని ఆరోపించారు.

దేవాలయాల్లో విగ్రహాలు దొంగతనం చేసిన దొంగ : బుద్దా వెంకన్న

మాచర్లలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో దేవాలయాల్లో విగ్రహాలు దొంగతనం చేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఎమ్మెల్యే సీటు ఇచ్చారని బుద్ధా వెంకన్న ఆరోపించారు. ఆనాడు గెలిచినప్పటి నుంచి పిన్నెల్లి, అతని సోదరుడి అరాచకాలకు అడ్డే లేకుండా పోయిందన్నారు. నియోజకవర్గంలో పిన్నెల్లి పైశాచికత్వానికి అంతులేకుండా పోయిందన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అతను రూ.2 వేల కోట్ల దోపిడి చేశాడని ఆరోపించారు. పిన్నెల్లి పాలనలో 8 హత్యలు, 79 దాడులు జరిగాయన్నారు. బడుగు, బలహీనవర్గాలు, మైనార్టీలపై దాదాపు  51 దాడులు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎన్నికల రోజున తాము మాచర్లకు వెళితే తమ తరపున వచ్చిన లాయర్ కిశోర్‌పై దాడి చేసి తల పగులగొట్టారని తెలిపారు. పిన్నెల్లి జీవితమంతా నేర చరిత్రే అన్నారు. హత్యలు, దోపిడీలు, దేవాలయాల్లోని విగ్రహాలను దొంగిలించడం చేసేవారని విమర్శించారు. పిన్నెల్లిని జగన్ అతిగా ప్రేమిస్తారని... ఎందుకంటే ఇద్దరిదీ నేర మనస్తత్వమే అన్నారు. 2004 నుంచి 2012 వరకు పిన్నెల్లికి ఎదురులేకుండా పోయిందన్నారు. పిన్నెల్లి సంపాదించుకోవడానికి వారికి వారే ఒక సపరేటు చట్టాన్ని రూపొందించుకున్నారని మండిపడ్డారు. విగ్రహాలు దోచుకోలేదని పిన్నెల్లి మాచర్ల సెంటర్‌లో భార్యా, పిల్లలతో వచ్చి ప్రమాణం చేయగలడా? అని సవాల్ చేశారు.

పేరుప్రఖ్యాతులుగాంచిన మాచర్ల నియోజకవర్గంలో... దొంగతనాలు చేసే పిన్నెల్లిని వైసీపీ నిలబెట్టిందని మండిపడ్డారు. పిన్నెల్లి సోదరుడు కూడా దొంగే అన్నారు. ఇద్దరు కలిసి మాచర్ల నియోజకవర్గంలో మారణ హోమం సృష్టించారన్నారు. 1996 నుంచి ఉమ్మడి ఏపీలో ప్యాక్షనిజం లేకుండా చేసిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. అంతకుముందు ఎన్నికల తర్వాత అనేకచోట్ల రీపోలింగ్ జరిగేదని... కానీ ఇప్పుడు ఎక్కడా జరగడం లేదని... ఎన్నికలు అంత ప్రశాంతంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. కానీ మాచర్లలో ఇప్పటికీ రీపోలింగ్ జరుగుతుందన్నారు.

ఈవీఎంలలో టీడీపీకి 18 ఓట్లు పోలైతే... వైసీపీకి 7 మాత్రమే వస్తున్నాయని.. దీనిని బట్టే పిన్నెల్లిపై ప్రజలకు ఉన్న వ్యతిరేకత తెలుస్తోందన్నారు. 4 ఓట్లల్లో 1 ఓటు పిన్నెల్లికి, 3 ఓట్లు బ్రహ్మారెడ్డికి పడ్డాయని జోస్యం చెప్పారు. అందుకే పిన్నెల్లి అరాచకానికి తెరలేపారని మండిపడ్డారు. ప్రకాశం, బాపట్ల, పల్నాడు జిల్లాల నుంచి మాచర్ల మీదుగా ఇతర రాష్ట్రాలకు వెళ్లే గ్రానైట్‌పై ట్యాక్స్ వేసి దాదాపు రూ.1200 కోట్లు దోచుకున్నాడని ఆరోపించారు. కొందరికి అన్నం, కూర అంటే ఇష్టమైతే, పిన్నెల్లికి గ్రానైట్ రాళ్లంటే ఇష్టమని ఎద్దేవా చేశారు.

2022 డిసెంబర్ 16న మాచర్లలో టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' కార్యక్రమం తెలపెట్టగా టీడీపీ నాయకులు, కార్యకర్తలపై పిన్నెల్లి అనుచరులు విరుచుకుపడి, బీభత్సం సృష్టించారని ఆరోపించారు. మాచర్లను రణరంగంగా మార్చేశారన్నారు. బ్రహ్మారెడ్డి ఇల్లు, పార్టీ కార్యాలయం, టీడీపీ నాయకుల ఇళ్లకు నిప్పు పెట్టారని మండిపడ్డారు. ఇంత జరిగినా అప్పటి ఎస్పీ రవిశంకర్‌ రెడ్డి దాన్ని టీడీపీ నాయకుల తప్పుగానే చిత్రీకరించే ప్రయత్నం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ప్రజల్లో చైతన్యం వచ్చిందని... ఏ గ్రానైట్ ఆధారంగా వారు భారీగా సంపాదించారో... అదే గ్రానైట్ రాళ్లతో ప్రజలు కొట్టి చంపేస్తారని వారికి భయం పట్టుకుందన్నారు. పిన్నెల్లి, అతని సోదరుడు ఊరు వదిలి పారిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. అందుకే భయపడి కోర్టును ఆశ్రయించి కొన్నాళ్లు బెయిల్ తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు.

మాచర్ల అల్లర్లకు కారణమైన వారికి త్వరలో బుద్ధి చెప్తాం: హైకోర్టు అడ్వకేట్ కిషోర్

స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో మార్చి 11న మాచర్లలో జరిగిన హింసలో తాను గాయపడ్డానని... ఇక్కడ లా అండ్ ఆర్డర్ అదుపులో ఉండదని హైకోర్టు అడ్వోకేట్ కిషోర్ అన్నారు. ఇక్కడ కొందరు పోలీసులు యూనిఫామ్ కూడా వేసుకోరని ఆరోపించారు. కొంతమంది పోలీసులు పిన్నెల్లి పాలేరుల్లా పని చేస్తున్నారని విమర్శించారు. ఆ రోజు తమ మీద జరిగిన దాడిలో పోలీసులు సక్రమంగా వ్యవహరించలేదని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు చెప్పారు. వేసవి తర్వాత విచారణ జరుగుతుందన్నారు. ఈవీఎం ధ్వంసం కేసులో పిన్నెల్లి బెయిల్ తెచ్చుకున్నాడన్నారు. అతనిపై 307, హత్యాయత్నం కేసులు ఉన్నాయని వాటిలోనూ బెయిల్ తెచ్చుకున్నాడన్నారు.

పిన్నెల్లికి ప్రజల చేతిలో బడితపూజ తప్పదు: పిల్లి మాణిక్యరావు

పిన్నెల్లి పైశాచికత్వంతో విర్రవీగాడని... అందుకే అతని నేరానికి సంబంధించిన అన్ని వివరాలతో పుస్తకాన్ని విడుదల చేశామని పిల్లి మాణిక్యరావు తెలిపారు. ఈ ఐదేళ్లలో పిన్నెల్లి విపరీతమైన అరాచకాలు సృష్టించాడన్నారు. వందల కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నాడని ఆరోపించారు. పిన్నెల్లి రోడ్డు మీదికి వస్తే బందిపోటు దొంగలను కొట్టినట్లుగా కొడతారని హెచ్చరించారు.

జగన్‌ రెడ్డిని చూసుకొనే పిన్నెల్లి ఆగడాలు: దేవినేని ఉమామహేశ్వరరావు

జగన్‌ను చూసుకొనే పిన్నెల్లి ఆగడాలు హద్దు మీరాయని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు అన్నారు. టీడీపీ పాలనలో పల్నాడు ప్రశాంతంగా ఉండేదని... వైసీపీ వచ్చాక వల్లకాడుగా మార్చిందని ధ్వజమెత్తారు. పిన్నెల్లి రూ.2 లక్షల ఆదాయం నుండి రూ.2 వేల కోట్ల స్థాయికి ఎదిగాడని ఆరోపించారు. పిన్నెల్లి ఎలా ఎదిగాడో జగన్ నేర సామ్రాజ్యానికి సంబంధించిన ఓ కేస్ స్టడీ అని ఎద్దేవా చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్షం లేకుండా చేసేందుకు పిన్నెల్లి నామినేషన్లు వేయకుండా చేశాడన్నారు.

మాచర్లలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన జగన్... పిన్నెల్లి గురించి చాలా గొప్పగా చెప్పాడని మండిపడ్డారు. తన స్నేహితుడు సౌమ్యుడని, మంచివాడని, గెలిపిస్తే మరింత ఉన్నతస్థాయికి తీసుకువెళతానని జగన్ చెప్పాడని గుర్తు చేశారు. అందుకే పిన్నెల్లి ఈవీఎంలను ధ్వంసం చేసేందుకు సాహసించాడన్నారు. ఈవీఎంలను బద్దలు కొట్టినవాడిపై చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు... పిన్నెల్లి వీడియో ఎలా బయటకు వచ్చింది? అని సిగ్గువిడిచి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. పిన్నెల్లి అరాచకాల్లో 79 కేసుల్లో 51 కేసులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై చేసిన దాడులవే అన్నారు. చేరెడ్డి మంజుల అనే టీడీపీ పోలింగ్ ఏజెంట్‌పై పిన్నెల్లి అనుచరులు గొడ్డలితో దాడి చేసినా... ఆమె ఎక్కడా తగ్గలేదని ప్రశంసించారు.  మంజుల పల్నాటి పౌరుషాన్ని చూపిందన్నారు.  రానున్న రోజుల్లో పిన్నెల్లి తగిన మూల్యం చెల్లించుకుంటాడని హెచ్చరించారు. పిన్నెల్లిపై ఉన్న కేసులన్నింటినీ కోర్టులో నిరూపించి తగిన శిక్షపడేలా చర్యలు తీసుకుంటామన్నారు.

More Telugu News