AAP: బీజేపీపై తీవ్ర ఆరోపణలు... అతిశీకి రౌస్ అవెన్యూ కోర్టు సమన్ల జారీ

AAP Atishi Summoned Over MLAs Poaching Claim Against BJP

  • ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ ప్రయత్నించిందని ఆరోపణలు
  • పార్టీ మారాలంటూ బీజేపీ తనకూ ఆఫర్ చేసిందన్న అతిశీ
  • నిరాధార ఆరోపణలు చేశారంటూ బీజేపీ దావా

ఢిల్లీ మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు అతిశీకి రౌస్ అవెన్యూ కోర్టు సమన్లు జారీ చేసింది. జూన్ 29న తమ ఎదుట హాజరు కావాలని అందులో పేర్కొంది. బీజేపీ నేత ప్రవీణ్ శంకర్ ఆమెపై పరువు నష్టం దావా వేశారు. 

తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను లాక్కోవడానికి బీజేపీ ఒక్కొక్కరికి రూ.25 కోట్లు ఆఫర్ చేసిందని కొన్ని రోజుల క్రితం అతిశీ ఆరోపించారు. తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఏడుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నించిందని అంతకుముందు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా ఆరోపణలు చేశారు.

అయితే, కేజ్రీవాల్, అతిశీలు తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడ్డారు. నిరాధార ఆరోపణలు సరికాదన్నారు. తాము ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించామనడానికి ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలపై ఫిర్యాదు చేయడంతో ఢిల్లీ పోలీసులు వారికి నోటీసులు జారీ చేశారు.

అయితే, పార్టీ మారాలంటూ బీజేపీ తనకు కూడా ఆఫర్ చేసిందని అతిశీ ఆ తర్వాత ఆరోపించారు. బీజేపీ సన్నిహితుల ద్వారా తనను సంప్రదించిందన్నారు. బీజేపీలో చేరాలని... తన రాజకీయ భవిష్యత్తు బాగుంటుందని వారు తనను సూచించారని చెప్పారు. బీజేపీలో చేరకుంటే ఈడీ కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించినట్లు చెప్పారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ పరువునష్టం దావా వేసింది. తమపై నిరాధార ఆరోపణలు చేసినందుకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది.

  • Loading...

More Telugu News