Shakunthala: భోజనానికి కూడా సావిత్రమ్మ ఇబ్బందిపడింది: నటి 'CID శకుంతల'
- 600 సినిమాలలో నటించిన 'CID శకుంతల'
- అలనాటి తారల గురించిన ప్రస్తావన
- సావిత్రి కష్టానికి కారణం వాళ్లేనని వివరణ
- ఆ తరం వారితో తన స్నేహం కొనసాగుతోందని వెల్లడి
పాతకాలం నాటి నటీనటులను ఎవరిని పలకరించినా సావిత్రి ప్రస్తావన రాకుండా ఉండదు. తాజాగా సుమన్ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చిన సీనియర్ నటి 'CID శకుంతల' కూడా తన కెరియర్ గురించి మాట్లాడుతూ, సావిత్రమ్మ గురించి ప్రస్తావించారు. " మా అమ్మగారివాళ్లది ఆంధ్ర .. నాన్నవాళ్లది 'సేలం'. ఆ తరువాత మేము చెన్నైలో స్థిరపడ్డాము" అని అన్నారు.
"తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ భాషల్లో మొత్తం నేను 600లకి పైగా సినిమాలు చేశాను. 'CID శంకర్' సినిమాతో నా పేరు 'CID శకుంతల' గా మారిపోయింది. ఆనాటి స్టార్ హీరోలందరితో కలిసి నటించాను. ఒకానొక దశలో నా డాన్స్ లేని సినిమా ఉండేది కాదు. అప్పట్లో నేను .. శారద .. వాణిశ్రీ .. బి. సరోజాదేవి .. షావుకారు జానకి మేమంతా చాలా స్నేహంగా ఉండేవాళ్లం. ఇప్పటికీ మా మధ్య ఆ స్నేహం అలాగే ఉంది" అని చెప్పారు.
"నేను సావిత్రిగారి వైభవం చూశాను .. ఆమె కష్టాలు కూడా చూశాను. నిజానికి సావిత్రిగారు చాలా గొప్ప మనిషి. ఆమెకి సాయం చేయడం మాత్రమే తెలుసు. అయితే ఆమె చుట్టూ చేరిన కొంతమంది వలన, ఆమెకి అలాంటి పరిస్థితి వచ్చింది. భోజనానికి కూడా ఆమె ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయి. దగ్గరివాళ్ల సాయానికి అందనంత దూరం ఆమె వెళ్లిపోయారు" అంటూ ఉద్వేగానికి లోనయ్యారు.