Varla Ramaiah: సీఎస్ జవహర్ రెడ్డి బరితెగించి భూబకాసురుడి అవతామెత్తారు: వర్ల రామయ్య
- సీఎస్ జవహర్ రెడ్డిపై భూ అక్రమాల ఆరోపణలు
- కుమారుడికి కట్టబెట్టేందుకే సీఎస్ జీవో నెం.596 విడుదల చేశారన్న వర్ల
- ఈ ప్రభుత్వంలో సీఎస్ కుమారుడి భూదోపిడీ కూడా ఉందని వెల్లడి
- జవహర్ రెడ్డి పాస్ పోర్టును సీజ్ చేసి ఎయిర్ పోర్టుల్లో నిఘా పెట్టాలని విజ్ఞప్తి
దొంగలు, దొంగలు ఊర్లు పంచుకున్నట్లుగా జగన్ రెడ్డి గ్యాంగ్ పేదల భూములను దోచుకొని, పంచుకుంటున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మండిపడ్డారు. విశాఖలో దళితుల అసైన్డ్ భూములను సీఎస్ జవహర్ రెడ్డి కుమారుడు మింగేయాలని ప్రయత్నించడం మహా ఘోరం అని వ్యాఖ్యానించారు.
పేదవాడి భూమిని కొట్టేయడమే సీఎస్ జవహర్ రెడ్డి చట్టమా? సుమారు రూ.4 వేల కోట్ల విలువగల 800 ఎకరాల అసైన్డ్ భూములను తన కుమారుడికి అప్పనంగా కట్టబెట్టేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి జీవో నెం.596 విడుదల చేయడం ఘోరాతి ఘోరం అని పేర్కొన్నారు.
"రాష్ట్రంలోని ఐఏఎస్ అధికారులకు ఆదర్శంగా నిలబడాల్సిన సీఎస్సే బరితెగించి భూబకాసురుని వేషం వేస్తే రాష్ట్రంలో న్యాయం చేసేదెవరు? అన్యాయం జరుగుతుందయ్యా... మాకు న్యాయం చెయ్యండి అని ఎవరినైతే వేడుకుంటామో అతనే అన్యాయాలు చేస్తుంటే ఇంకెవరికి చెప్పాలో అర్థం కావడం లేదు.
పేదవారు, ఆకలి మంటతో ఉన్నారు కాబట్టి వారి ఇంటికి వెళ్ళి పెన్షన్ పంపిణీ చేయండని సీఎస్ జవహర్ రెడ్డిని మేము వేడుకున్నా... చస్తే చావనివ్వండి అన్నట్లు నిర్లక్షంగా సమాధానం చెప్పారు. పేద ప్రజల ఉసురు పోసుకోవడం వలనే సీఎస్ జవహర్ రెడ్డి భూభాగోతం బయటపడింది.
ఉత్తరాంధ్రలో దాదాపు 60 శాతం భూములను కడప వాళ్లే కొట్టేశారు. కడప వాళ్లకి ఇక్కడ పనేంటని మంత్రి ధర్మాన కూడా అన్నారు. పేద దళితుల (మాల, మాదిగలు) జీవనోపాధి కోసం ప్రభుత్వమిచ్చిన అసైన్డ్ భూములను మదించిన ఏనుగుల్లాంటి ఇటువంటి అధికారులు, వారి అండతో రాజకీయ నాయకులు కొట్టేయడం దుర్మార్గం, పాపం కూడా.
దళితుల భూములు కొనకూడదు, ఆక్రమించకూడదు అని చట్టాలున్నా ఎంతోమంది అధికారులు, బరితెగించిన రాజకీయ పెద్దలు, డబ్బు మదంతో కొట్టుమిట్టాడుతున్న వారు దళితుల భూములను, వారి అవసరాలను ఆసరాగా తీసుకొని కొద్దో గొప్పో ధనాన్ని వాళ్ల ముఖాన కొట్టి... కోట్లు విలువు చేసే అసైన్డ్ భూములను దోచేశారు.
రేపు చంద్రబాబు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన వెంటనే, దళితుల భూములను చేజిక్కించుకుని, వారికి అన్యాయం చేస్తున్న సీఎస్ జవహర్ రెడ్డి, వారు కుమారుల్లాంటి ఘరానా పెద్దలను వదలకుండా శిక్షించడం ఖాయం. వారి వద్ద నుండి అసైన్డ్ భూములు స్వాధీనం చేసుకొని, రాష్ట్రంలోని పేదవారికి పంచాలని, అవసరమైతే అసైన్డ్ భూములను కొట్టేసిన భూబకాసురులపై ఒక కమిషన్ వేయాలని కూడా మా అధినేతను కోరుతాం.
సీఎస్ జవహర్ రెడ్డి ఈ రోజు నుండి ఏ ఫైల్ చూడకుండా, ముఖ్యంగా భూ వ్యవహారాలకు చెందిన ఫైల్స్ చూడకుండా ఎన్నికల సంఘం కట్టడి చేయాలి. విశాఖకు చెందిన ఏ అధికారి కూడా ఆయనను కలవకుండా నిరోధించాలి. దేశంలోని అన్ని ఎయిర్ పోర్టులను అలెర్ట్ చేసి సీఎస్ జవహర్ రెడ్డి విదేశాలకు పోకుండా పాస్ పోర్ట్‌ను స్వాధీన పరుచుకోవాలి. ఆయన కదలికలపై నిరంతర ఇంటెలిజెన్స్ నిఘా పెట్టాలి.
ఈ భూభాగోతంపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించి, సీబీఐ దర్యాప్తునకు ఆదేశించి, ఈ కేసులో పూర్తి నిజానిజాలు బయటకు తీయాలి. దీనిలోని భూ కబ్జాదారులపై, భూ దొంగలపై కఠిన చర్యలు తీసుకోవాలి. జవహర్ రెడ్డి పదవీవిరమణ చేయకముందే విచారణ పూర్తి చేయాలి. ఆయనను విచారించి, ఆయన భూభాగోతాలను ప్రజలకు తెలియజేయాలి.
గత ఐదేళ్లుగా విశాఖ, విజయనగరం జిల్లాల్లో జరిగిన భూ క్రయ విక్రయాలపై కూడా మరో కమిషన్ వేసి విచారణ జరిపించాలని చంద్రబాబును కోరుతాం" అంటూ వర్ల రామయ్య స్పష్టం చేశారు.