Pakistan: టీ20 వరల్డ్ కప్ కోసం జట్టును ప్రకటించిన పాకిస్థాన్
- అమెరికా, వెస్టిండీస్ దేశాల్లో టీ20 వరల్డ్ కప్
- జూన్ 2న ప్రారంభం కానున్న మెగా టోర్నీ
- 15 మందితో జట్టును ప్రకటించిన పాకిస్థాన్
అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న టీ20 వరల్డ్ కప్ లో పాల్గొనే పాకిస్థాన్ జట్టును ప్రకటించారు. సీనియర్ బ్యాట్స్ మన్ బాబర్ అజామ్ ఈ మెగా టోర్నీలో పాక్ జట్టు కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. సూపర్ ఫాస్ట్ బౌలర్ హరీస్ రవూఫ్ గాయం నుంచి కోలుకోవడంతో అతడికి కూడా వరల్డ్ కప్ లో పాల్గొనే పాక్ జట్టులో స్థానం కల్పించారు.
ఇక, అబ్రార్ అహ్మద్, అజామ్ ఖాన్, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, సయీమ్ అయూబ్, ఉస్మాన్ ఖాన్ లు తొలిసారి టీ20 వరల్డ్ కప్ బరిలో దిగే అవకాశం లభిస్తోంది. అయితే, సీనియర్ బౌలర్ హసన్ అలీకి పాక్ జట్టులో స్థానం దక్కలేదు.
ప్రస్తుతం పాక్ జట్టు టీ20 వరల్డ్ కప్ సన్నాహకాల్లో భాగంగా ఇంగ్లండ్ జట్టుతో సిరీస్ ఆడుతోంది. ఈ సిరీస్ లో ఆడుతున్న పాక్ జట్టులోని చాలామంది ఆటగాళ్లు వరల్డ్ కప్ కు ఎంపికయ్యారు.
పాక్ జట్టు ఈ వరల్డ్ కప్ లో భారత్, ఐర్లాండ్, కెనడా, అమెరికా జట్లతో కలిసి గ్రూప్-ఏలో ఉంది. టోర్నీలో తన తొలి మ్యాచ్ ను పాక్ జట్టు జూన్ 6న డల్లాస్ లో ఆడనుంది. ఇక, చిరకాల ప్రత్యర్థి భారత్ తో జూన్ 9న న్యూయార్క్ లో ఆడనుంది. టీ20 వరల్డ్ కప్ జూన్ 2 నుంచి 29వ తేదీ వరకు జరగనుంది.
పాకిస్థాన్ జట్టు...
బాబర్ అజామ్ (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్, ఫఖార్ జమాన్, ఇఫ్తికార్ అహ్మద్, అబ్రార్ అహ్మద్, అజామ్ ఖాన్, షాదాబ్ ఖాన్, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, ఇమాద్ వసీం, నసీమ్ షా, మహ్మద్ ఆమిర్, సయీమ్ అయూబ్, హరీస్ రవూఫ్, షహీన్ షా అఫ్రిది, ఉస్మాన్ ఖాన్.