Pune Boy Accident Case: విమర్శలతో వెనక్కి తగ్గిన జువైనల్ కోర్టు.. పూణె బాలుడి బెయిలు రద్దు
- జూన్ 5 వరకు బాలుడికి రిమాండ్
- అతడి తండ్రికి రెండు రోజుల పోలీస్ కస్టడీ
- బాలుడి తాతకు చోటా రాజన్‌తో సంబంధాలపై దర్యాప్తు ముమ్మరం
- నిబంధనలు అతిక్రమించిన రెండు పబ్‌లపై కఠిన చర్యలు
తాగినమత్తులో కారు నడిపి ఇద్దరి మృతికి కారణమైన 17 ఏళ్ల పూణె బాలుడికి 14 గంటల్లోనే బెయిలు మంజూరు చేసి వ్యాసం రాయమన్న పూణె జువైనల్ బోర్డు తీర్పుపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. తాగినమత్తులో కన్నుమిన్నుకానక 160 కిలోమీటర్ల వేగంతో కారు నడిపి ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల మరణానికి కారణమైన వ్యక్తికి గంటల వ్యవధిలోనే బెయిలా? అంటూ తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో బాలుడి బెయిలును రద్దు చేస్తూ తాజాగా తీర్పు వెలువరిస్తూ జూన్ 5 వరకు రిమాండ్ విధించింది. అలాగే, బాలుడికి కారు ఇచ్చిన అతడి తండ్రిని రెండు రోజుల (24 వరకు) పోలీస్ కస్టడీకి పంపింది.
మరోవైపు, నిందితుడైన బాలుడి తాత సురేంద్రకుమార్ అగర్వాల్‌కు అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్‌తో సంబంధాలపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇంకోవైపు, నగరంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న రెండు పబ్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆ తర్వాత ఇతర పబ్‌ల పనిపట్టాలని పోలీసులు నిర్ణయించారు. బాలుడి నేరం అతిపెద్దది కావడంతో అతడిని మేజర్‌గా పరిగణించాలంటూ పూణె పోలీసులు కోర్టులో రివ్యూ దాఖలు చేశారు.