Brain Eating Amoeba: కేరళలో షాకింగ్ ఘ‌ట‌న‌.. 'బ్రెయిన్‌ ఈటింగ్‌ అమీబా'తో ఐదేళ్ల‌ చిన్నారి మృత్యువాత‌!

5 year old girl in Kerala dies of infection caused by brain eating amoeba after dip in a pond

  • కేరళలోని మలప్పురం జిల్లాలో ఘటన
  • కలుషిత నీరే కారణం
  • ఇంటి స‌మీపంలోని చెరువులో స్నానం చేసిన బాధిత బాలిక‌
  • ఆమె ముక్కు ద్వారా శరీరంలోకి వెళ్లిన అమీబా 
  • మెదడుపై తీవ్ర ప్రభావం చూపించినట్టు గుర్తించిన‌ వైద్యులు

 కలుషిత నీటిలో స్వేచ్ఛగా జీవించే అమీబా వల్ల కలిగే అరుదైన మెదడు ఇన్ఫెక్షన్ 'అమీబిక్‌ మెనింగోన్సిఫాలిటీస్‌' (బ్రెయిన్‌ ఈటింగ్‌ అమీబా) వ్యాధితో కేరళకు చెందిన ఓ ఐదేళ్ల చిన్నారి మృతి చెందింది. మూన్నియూర్ పంచాయతీకి చెందిన చిన్నారి కోజికోడ్ మెడికల్ కాలేజ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్‌లో వారం రోజులుగా చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందినట్లు ఆసుపత్రి వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

బాధిత బాలిక‌ మే 1న సమీపంలోని చెరువులో స్నానం చేసింది. దీంతో మే 10వ తేదీ నాటికి జ్వరం, తలనొప్పి, వాంతులు వంటి లక్షణాలు కనిపించాయని కుటుంబసభ్యులు తెలిపారు. కలుషితమైన ఆ నీటిలో స్వేచ్చగా జీవించే నాన్-పారాసిటిక్ అమీబా ఆమె ముక్కు ద్వారా శరీరంలోకి వెళ్లి మెదడుపై తీవ్ర ప్రభావం చూపించినట్టు వైద్యులు గుర్తించారు. వ్యాధిని సకాలంలో కుటుంబ సభ్యులు గుర్తించకపోవడం, వైద్య చికిత్స అందించడంలో అప్పటికే ఆలస్యం కావ‌డంతో బాలిక చ‌నిపోయిన‌ట్లు వైద్య నిపుణులు వెల్లడించారు.

అస‌లేంటీ బ్రెయిన్‌ ఈటింగ్‌ అమీబా?
పరాన్నజీవి కానటువంటి బ్యాక్టీరియా వర్గానికి చెందిన ఒక రకమైన అమీబాతో ఈ వ్యాధి వస్తుంది. కలుషితమైన నీటిలో జీవించే ఈ జీవి ముక్కు లేదా నోటిద్వారా శరీరంలోకి ప్రవేశించి మెదడును క్రమక్రమంగా పనిచేయకుండా చేస్తుంది. దీన్ని ఒకవిధంగా మెదడును తినేసే అమీబా (బ్రెయిన్‌ ఈటింగ్‌ అమీబా) గా పిలుస్తారు. ఈ వ్యాధి సోకినవారికి తొలుత తీవ్ర జ్వరం, తలనొప్పి, వాంతులు అవుతాయి. అలాంటి వారికి వెంటనే వైద్యం అందించకపోతే బాధితులు చ‌నిపోయే ప్ర‌మాదం ఉంటుంది. కేరళలో గతంలో కూడా రెండుసార్లు ఇలాంటి కేసులు వెలుగు చూశాయి. 2017లో ఒకసారి, 2023లో మరోసారి ఈ కేసులు బయటపడ్డాయి. 

  • Loading...

More Telugu News