Chinmayi: మీ ట్రోలింగ్ కారణంగా ఆ తల్లి ప్రాణాలు తీసుకుంది.. ఇప్పుడు మీ అందరికీ సంతోషమా?: గాయని చిన్మయి
- చెన్నైలో నాలుగో అంతస్తు నుంచి కిందకు జారిపడ్డ చిన్నారి
- అదృష్టవశాత్తూ మరో అంతస్తు అంచున పడి ఆగిన పాపను కాపాడిన స్థానికులు
- వీడియో వైరల్ కావడంతో తల్లిపై నెటిజన్ల ట్రోల్స్
- మనస్తాపంతో చిన్నారి తల్లి ఆత్మహత్య
- ఇదే విషయమై ఇన్‌స్టా వేదికగా చిన్మయి ఎమోషనల్ పోస్ట్
ఇటీవల తమిళనాడు రాజధాని చెన్నైలో ఓ ఏడు నెలల చిన్నారి ప్రమాదవశాత్తూ అపార్ట్‌మెంట్ నాలుగో అంతస్తు నుంచి కిందకు పడుతున్న వీడియో నెట్టింట వైరల్ అయింది. అదృష్టవశాత్తూ ఆ చిన్నారి మరో అంతస్తు అంచున పడి ఆగింది. ఆ తర్వాత ఇద్దరు వ్యక్తులు పైకెక్కి చిన్నారిని రక్షించారు. ఇక వీడియో చూసిన నెటిజన్లు తల్లిదే తప్పు అని కామెంట్ చేశారు. ఇష్టానుసారంగా ట్రోలింగ్ చేయడంతో మనస్తాపం చెందిన పాప తల్లి ఆదివారం (మే 19న) ఆత్మహత్య చేసుకుంది.
ఈ ఘటనపై తాజాగా గాయని చిన్మయి ఇన్‌స్టా వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా ఆమె ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు. "మీ ట్రోలింగ్ కారణంగా ఓ చిన్నారి తల్లి బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. ఇప్పుడు మీకు సంతోషం కదా. అదే అత్యాచారం చేసే వాళ్లపై ఇంతగా ఎందుకు రియాక్ట్ కారు. టికెట్లు కొనుగోలు చేసి మరీ హత్య, అత్యాచారం చేసే వాళ్ల పర్ఫార్మెన్స్ చూస్తారు. ఎవరైతే ఆమెను ట్రోల్ చేశారో.. ఇప్పుడు వాళ్లు వచ్చి ఆ చిన్నారిని చూసుకోండి" అని నెటిజన్లపై చిన్మయి మండిపడ్డారు.