Nirmala Sitharaman: ఢిల్లీ మెట్రోలో ప్రయాణించిన నిర్మలా సీతారామన్.. మంత్రి భుజం తట్టి మరీ బైబై చెప్పిన ఓ సామాన్య ప్రయాణికురాలు.. వీడియో వైరల్!
- సాధారణ ప్రయాణికురాలిగా ఢిల్లీ మెట్రోలో దర్శనమిచ్చిన నిర్మలా సీతారామన్
- రైల్లో కేంద్ర మంత్రిని చూసి ఒక్కసారిగా షాక్ అయిన ప్రయాణికులు
- ఆమెతో ఫొటోలు, సెల్ఫీలు తీసుకున్న వైనం
- మంత్రి మెట్రో జర్నీపై నెటిజన్ల భిన్నాభిప్రాయాలు
ఇటీవల పలువురు నేతలు బస్సులు, రైళ్లలో ప్రయాణిస్తూ ప్రజలకు చేరువవుతున్నారు. ఇక మోదీ, ద్రౌపది ముర్ము, కేంద్ర మంత్రులు.. ఇలా అందరూ ఢిల్లీ మెట్రోలో ప్రయాణించి.. స్థానికులతో ముచ్చటించారు. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఢిల్లీ మెట్రోలో ప్రయాణించారు. మంత్రి సీతారామన్ శుక్రవారం లక్ష్మీనగర్‌కు ఢిల్లీ మెట్రోలో ప్రయాణించడం జరిగింది.
ఈ సందర్భంగా రైల్లోని ప్రయాణికులతో ఆమె ముచ్చటించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైల్లో కేంద్ర మంత్రిని చూసిన ప్రయాణికులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆమెతో ఫొటోలు, సెల్ఫీలు తీసుకున్నారు. ఈ ట్రైన్ జర్నీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలను నిర్మలమ్మ కార్యాలయం ఎక్స్ (ట్విటర్) లో పోస్టు చేసింది. దీంతో ప్రస్తుతం ఆ ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇందులో ఓ వీడియో నెటిజన్లను బాగా ఆకర్షిస్తోంది. ఓ సామాన్య ప్రయాణికురాలు తన స్టేషన్ రాగానే దిగే ముందు మంత్రి నిర్మలా సీతారామన్ భుజం తట్టి మరీ బైబై చెప్పడం మనం ఆ వీడియోలో చూడొచ్చు. ఇక మంత్రి మెట్రో జర్నీపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. కొందరు మంత్రి సామాన్యులతో కలిసి మెట్రోలో ప్రయాణించడాన్ని మెచ్చుకుంటుంటే.. మరికొందరు మాత్రం ఇదంతా డ్రామా అంటూ విమర్శిస్తున్నారు.
'నాకు తెలిసి మంత్రి గారు తోటి ప్రయాణికులను తప్పనిసరిగా పన్నుల (ట్యాక్సులు) గురించి ప్రశ్నలు అడిగి ఉంటారని' అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. 'ఆర్థిక మంత్రి ప్రజా రవాణాను ఉపయోగించుకోవడం చూస్తుంటే ఆనందంగా ఉంది. ఆమె తోటి ప్రయాణికులతో ముచ్చటించడం బాగుంది' అని మరోకరు రాసుకొచ్చారు. 'మనకు చాలా వరకు ఎన్నికల ప్రచారాలలోనే ఇలాంటి దృశ్యాలు కనిపిస్తుంటాయి. వారు (బీజేపీ) గత పదేళ్ల నుంచి పరిపాలిస్తున్నారు. కానీ ఏ ఒక్క రోజు కూడా ఇలాంటి దృశ్యం కనిపించలేదు. ఇది పక్కా డ్రామా' అంటూ మరో యూజర్ కామెంట్ చేశారు.