Telangana: తెలంగాణ సంక్షిప్త పదాన్ని టీఎస్‌కు బదులు టీజీగా మార్చాలని సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు

Change from TS to TG for Telangana
  • కలెక్టర్లతో సీఎస్ శాంతికుమారి వీడియో కాన్ఫరెన్స్
  • ధాన్యం సేకరణపై సమీక్ష నిర్వహించిన సీఎస్
  • ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించే చర్యలు చేపట్టాలని ఆదేశాలు
  • స్కూల్స్ ప్రారంభమయ్యే నాటికి అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమం కింద చేపట్టిన పనులు పూర్తి చేయాలన్న సీఎస్

తెలంగాణ సంక్షిప్త పదాన్ని టీఎస్ (TS)కు బదులు టీజీ (TG)గా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. జీవోలు, నోటిఫికేషన్లు, నివేదికలు, లెటర్ హెడ్‌లలో టీజీగా ఉండాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ శాఖలు, సంస్థలు, అటానమస్ విభాగాలన్నీ దీనిని పాటించాలని ఆదేశించారు.

తెలంగాణ ఉద్యమం సమయంలో సంక్షిప్తంగా టీజీని ఉపయోగించారు. తమ వాహనాలపై నాడు ఏపీకి బదులు టీజీ అని రాసుకున్నారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను సంక్షిప్తంగా టీఎస్‌గా మార్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇప్పుడు టీజీగా మార్చింది.

కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్

జిల్లా కలెక్టర్లతో సీఎస్ శాంతికుమారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ధాన్యం సేకరణపై సమీక్ష చేశారు. ధాన్యం సేకరణ త్వరగా పూర్తి చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టడానికి కొంతమంది జిల్లాల కలెక్టర్లు తీసుకున్న చర్యలను సీఎస్‌ అభినందించారు. ఇదే విధానాన్ని అనుసరించి రాష్ట్రవ్యాప్తంగా రైతులు నష్టపోకుండా ఉండేలా అన్ని జిల్లాల కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సూచించారు.

పాఠశాలలు పున:ప్రారంభమయ్యే తేదీ జూన్ 12లోగా అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమం కింద చేపట్టిన పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. పాఠశాలలు తెరిచే రోజున విద్యార్థులకు నోట్‌బుక్‌లు, పాఠ్యపుస్తకాలు, ఒక జత స్కూల్ యూనిఫాం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చిన్నపాటి మరమ్మతు పనులు, విద్యుద్దీకరణ, మరుగుదొడ్లు, త్రాగునీరు, పెయింటింగ్, ఫర్నీచర్ పనులు నాణ్యతగా జరిగేలా పర్యవేక్షించాలని ఆదేశించారు.

  • Loading...

More Telugu News