Modi-Press Conferences: తాను పత్రికా సమావేశాలు నిర్వహించనన్న విమర్శపై ప్రధాని స్పందన

PM Modi on why he doesnt hold press conferences

  • తానెప్పుడూ పత్రికా ఇంటర్వ్యూలను కాదనలేదన్న ప్రధాని
  • మీడియాను అనేక రకాలుగా వాడుకుంటున్నారని వ్యాఖ్య
  • తనకు ఆ మార్గంలో వెళ్లడం ఇష్టం లేదని స్పష్టీకరణ
  • ప్రస్తుతం ప్రజలతో అనుసంధానమయ్యేందుకు అనేక ప్రత్యామ్నాయాలు ఉన్నాయని వెల్లడి

తాను పత్రికా సమావేశాలు నిర్వహించనంటూ ప్రతిపక్షాలు చేసే విమర్శలపై ప్రధాని మోదీ తొలిసారిగా స్పందించారు. జాతీయ మీడియాకు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తానెప్పుడూ పత్రికా ఇంటర్వ్యూలను తిరస్కరించలేదని మోదీ పేర్కొన్నారు. అయితే, ప్రస్తుతం మీడియా పాత్ర కూడా మారిందని, ప్రజలతో టచ్‌లో ఉండేందుకు అనేక కొత్త వేదికలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. 

గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికంటే ప్రస్తుతం పత్రికా సమావేశాలు తక్కువగా నిర్వహించడంపై ప్రధాని స్పందించారు. మీడియాను అనేక రకాలుగా వినియోగించుకుంటున్నారని, తనకు ఆ మార్గంలో వెళ్లడం ఇష్టం లేదని స్పష్టం చేశారు. ‘‘నేను కష్టపడి పనిచేయాలని అనుకుంటా. పేద ప్రజల సమస్యలు తీర్చాలని భావిస్తా. అయితే, నేను రిబ్బన్లు కత్తిరించి ఫొటోలు దిగి ప్రచారం చేసుకోవచ్చు. కానీ నాకు అది ఇష్టం లేదు. ఏదైనా రాష్ట్రంలో చిన్న జిల్లాకు వెళ్లి అక్కడ ఓ చిన్న స్కీమ్ కోసం పనిచేయడమే నాకు ఇష్టం’’ అని మోదీ అన్నారు. తాను ఓ కొత్త పని సంస్కృతిని తీసుకొచ్చానని మోదీ తెలిపారు. ‘‘ఇది బాగుందనిపిస్తే మీడియా దాన్ని సరైన పద్ధతిలో చూపించాలి. లేదా ప్రచారం కల్పించకూడదు’’ అని పేర్కొన్నారు. 

ఒకప్పటి లాగా మీడియా ప్రస్తుతం ప్రత్యేక వ్యవస్థ కాదని పేర్కొన్నారు. ఒకప్పుడు తాను పత్రికలకు ఇంటర్వ్యూలు ఇచ్చేవాడినని, కానీ ప్రస్తుతం తనను ఇంటర్వ్యూ చేసే యాంకర్ల పేరు కూడా ప్రజలకు తెలుసని పేర్కొన్నారు. ఇప్పుడు ప్రజలతో అనుసంధానమయ్యేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయన్నారు. ప్రస్తుతం ప్రజలు మీడియాతో సంబంధం లేకుండా తమ వాణిని వినిపించగలుగుతున్నారని అన్నారు.

  • Loading...

More Telugu News