Raghu Rama Krishna Raju: ఆ అరక్షణం గ్యాప్ పులివర్తి నానీని బతికించింది: రఘురామకృష్ణరాజు
- మే 14న తిరుపతిలో పులివర్తి నానీపై దాడి
- నేడు పులివర్తి నానీని పరామర్శించిన రఘురామ
- నానీ ఓ సమ్మెట దెబ్బ నుంచి త్రుటిలో తప్పించుకున్నారని వెల్లడి
- రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉన్నాయా అనే సందేహం వస్తోందని వ్యాఖ్యలు
చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై ఈ నెల 14న తిరుపతిలో దాడి జరగడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, గాయాలపాలై చికిత్స పొందుతున్న పులివర్తి నానీని టీడీపీ నేత రఘురామకృష్ణరాజు పరామర్శించారు. అనంతరం రఘురామ మీడియాతో మాట్లాడుతూ, ఈ దాడి నుంచి పులివర్తి నాని అదృష్టవశాత్తు బతికిబయటపడ్డారని వెల్లడించారు.
ఈ దాడిలో పులివర్తి నాని ఓ సమ్మెట దెబ్బ నుంచి త్రుటిలో తప్పించుకున్నారని, ఆ దెబ్బ కణత పక్క భాగంను తాకుతూ భుజంపై పడిందని అన్నారు. వాళ్లు చేసిన దుశ్చర్యలో అదే దెబ్బ తలకు తగిలి ఉంటే ఏం జరిగేదో అని రఘురామ ఆందోళన వ్యక్తం చేశారు. ఇదంతా అరక్షణం వ్యవధిలో జరిగిపోయిందని తెలిపారు. ఆ అరక్షణం వ్యవధే ఆయనను బతికించిందని చెప్పుకొచ్చారు.
"ఇలాంటి ఘటనలు చిత్తూరులోని ఇతర ప్రాంతాల్లో ఎప్పుడో 20 ఏళ్ల కిందట జరిగాయని విన్నాం. ప్రముఖ ఆధ్యాత్మిక నగరమైన తిరుపతికి 5 కిలోమీటర్ల పరిధిలో ఇలాంటి ఘటనలు జరగడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ఈవీఎంలు భద్రపరిచిన పద్మావతి వర్సిటీ వద్దకు దుండగులు మారణాయుధాలతో రాగలిగారంటే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉన్నాయా, లేదా అనే సందేహం వస్తోంది.
ముఖ్యంగా, ఈ అంశం గురించే సీఎస్ ను, డీజీపీని కేంద్ర ఎన్నికల సంఘం స్వయంగా వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఏదేమైనా ఈ చర్య ద్వారా వైసీపీ తమ ఓటమిని పరోక్షంగా అంగీకరించినట్టయింది. సజ్జల ముఖ కవళికలు, హావభావాలు కూడా అలాగే ప్రస్ఫుటమయ్యాయి.
ఇక, కొంచెం ఉపశమనం కలిగించేందుకు ఇవాళ ఐప్యాక్ వద్దకు వెళ్లాడు. నిజానికి నిన్ననే ఐప్యాక్ వద్దకు వెళ్లాలి. కానీ ఆయన కొంచెం డిప్రెషన్ లో ఉన్నాడు. మీరే ఇలా ఢీలా పడితే కౌంటింగ్ కు కూడా ఏజెంట్లు ఉండరన్న సలహాతోనే ఇవాళ ఐప్యాక్ వద్దకు వచ్చాడని నాకున్న సమాచారం.
సహజంగా, మనం ఇన్ని స్థానాల్లో గెలవబోతున్నాం అని ఐప్యాక్ వాళ్లే ఈయనకు చెప్పాలి, కానీ, మనం ఇన్ని స్థానాలు గెలవబోతున్నాం అని ఈయనే వాళ్లకు చెబుతున్నాడని మీడియాలో వచ్చింది. ఏది ఎలా ఉన్నా... తక్కువలో తక్కువగా కూటమికి 125 స్థానాలు... ట్రెండ్ ప్రకారం చూస్తే 150కి పైగా అసెంబ్లీ స్థానాలు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు" అంటూ రఘురామ వివరించారు.