KTR: అధికారంలో ఉన్నానని రేవంత్ రెడ్డి గుర్తించాలి... ఉద్యోగులను ముఖ్యమంత్రే నమ్మకపోతే ఎలా?: కేటీఆర్

Why Revanth Reddy is not believing employees questions ktr

  • ఉద్యోగులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారనీ, అలాంటి వారిని తాము ఎప్పుడూ విమర్శించలేదన్న కేటీఆర్
  • ప్రభుత్వాన్ని నడపడం రేవంత్ రెడ్డికి చేతకాక ఉద్యోగులపై విమర్శలు చేస్తున్నారని వ్యాఖ్య
  • ఉద్యోగులను అవమానించడం రేవంత్ రెడ్డికి తగదన్న కేటీఆర్
  • ముఖ్యమంత్రికి రైతుల కష్టాలు కనిపించడం లేదా? అని ప్రశ్న

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను అధికారపక్షంలో ఉన్నానని గుర్తించాలని... ప్రభుత్వ ఉద్యోగులను ముఖ్యమంత్రే నమ్మకపోతే ఎలా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. విద్యుత్ కోతలపై ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. విద్యుత్ కోతలకు కొంతమంది ఉద్యోగులు కారణమని, హరీశ్ రావు వారితో కుట్రపూరితంగా అలా చేయిస్తున్నారన్నారు. ఈ వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. తమ పదేళ్ల పాలనలో విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేశామన్నారు.

కానీ ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి విద్యుత్ ఉద్యోగులపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని... అందుకే తాము ఉద్యోగులను ఎప్పుడూ విమర్శించలేదన్నారు. ప్రభుత్వాన్ని నడపడం రేవంత్ రెడ్డికి చేతకాక ఉద్యోగులపై విమర్శలు చేస్తున్నారన్నారు. ఉద్యోగులను అవమానించడం ఆయనకు తగదన్నారు. పోలీసులను, ఉద్యోగులను తిట్టడానికి ఆయన ప్రతిపక్షంలో లేరని... ముఖ్యమంత్రిగా ఉన్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని చురక అంటించారు.

పోలింగ్ విధులకు వెళ్లిన టీచర్లపై లాఠీఛార్జ్ చేయడం ఏమిటని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ అయిదు నెలల కాలంలో శ్వేతపత్రాలు అంటూ కొంతకాలం, మేడిగడ్డ ప్రాజెక్టు అంటూ మరికొంతకాలం సమయాన్ని వృథా చేసిందన్నారు. అప్పుల విషయంలో కాంగ్రెస్ నేతలవి చిల్లర రాజకీయాలు అని మండిపడ్డారు. జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ అని చెప్పి యువతను దగా చేశారన్నారు.

ముఖ్యమంత్రికి రైతుల కష్టాలు కనిపించడం లేదా?

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రైతుల కష్టాలు కనిపించడం లేదా? రాజకీయాలు పక్కన పెట్టి రైతులకు న్యాయం చేయాలని కేటీఆర్ కోరారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని పలు ప్రాంతాల్లో రైతులు రోడ్డెక్కారన్నారు. ప్రభుత్వం వెంటనే ఎఫ్‌సీఐ ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే రైతుల తరఫున రోడ్డెక్కుతామని... ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు. రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని.. మీ వెనుక కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ ఉందని ధైర్యం చెప్పారు.

నల్గొండ-వరంగల్-ఖమ్మం పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్న రాకేశ్ రెడ్డిని గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియదని తీన్మార్ మల్లన్నను ఉద్దేశించి విమర్శించారు. ఆయన మీడియాను అడ్డుపెట్టుకొని బ్లాక్ మెయిల్ చేస్తారని ఆరోపించారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని రేవంత్ రెడ్డి చెప్పారని... ఇప్పటికే ఐదు నెలలు పూర్తయిందని, మరో ఆరేడు నెలల్లో ఈ ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాలు రావాలంటే మండలిలో బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న రాకేశ్ రెడ్డిని గెలిపిస్తే ఆయన ప్రభుత్వాన్ని నిలదీస్తారన్నారు.

  • Loading...

More Telugu News