Mumbai: ముంబైలో ఈదురుగాలులతో భారీ వర్షం... కూలిన 100 అడుగుల హోర్డింగ్

Massive Dust Storm Season First Rain In Mumbai

  • మధ్యాహ్నం 3 గంటల సమయంలో మేఘావృతమై... మెరుపులు, ఉరుములతో భారీ వర్షం
  • ముంబై, చుట్టుపక్కల ప్రాంతాలకు ఉక్కపోత నుంచి ఉపశమనం
  • ఘట్‌కోపర్‌లోని చెద్దా నగర్ జంక్షన్‌లో కూలిన భారీ బిల్ బోర్డు
  • ఓ మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురవచ్చని వాతావరణ విభాగం హెచ్చరిక

ముంబైని ఈ సీజన్‌లో వర్షం పలకరించింది. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై చీకటిగా మారింది. ఉరుములు, మెరుపులతో... ఈదురుగాలులతో వర్షం కురిసింది. దీంతో ముంబై, ఆ చుట్టుపక్కల ప్రాంతాల వారికి ఉక్కపోత నుంచి ఉపశమనం లభించింది. వర్షం కారణంగా నగరంలో ట్రాఫిక్ జామ్ అయింది. ఘట్‌కోపర్, బాంద్రా కుర్లా, ధారావి ప్రాంతాల్లో బలమైన గాలులతో వర్షం కురిసింది.

దేశంలో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ముంబై ఒకటి. ఈదురుగాలులు, భారీ వర్షం నేపథ్యంలో ఇక్కడి నుంచి విమాన రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. తర్వాత సాయంత్రం 5.03 గంటలకు రాకపోకలను పునరుద్ధరించారు. వర్షం కురిసిన సమయంలో 15 విమానాలను దారి మళ్లించారు. ఘట్‌కోపర్‌లోని చెద్దా నగర్ జంక్షన్‌లో 100 అడుగుల బిల్ బోర్డు కూలి సమీపంలోని పెట్రోల్ బంక్‌పై పడింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బిల్ బోర్డు కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ రంగంలోకి దిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, 67 మంది గాయపడ్డారని తెలుస్తోంది.

థానే, పాల్ఘర్, ముంబైలలో ఉరుములు మెరుపులతో కూడిన ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కురవచ్చని భారత వాతావరణ విభాగం హెచ్చరికలు జారీ చేసింది. పాల్ఘర్, థానే జిల్లాల్లో రానున్న మూడు నాలుగు గంటల్లో... 50 నుంచి 60 కిలో మీటర్ల వేగంతో గాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవచ్చని తెలిపింది. భారీ గాలులు, వర్షాల కారణంగా ఆరే - అంధేరీ ఈస్ట్ మెట్రో స్టేషన్ల మధ్య రాకపోకలను నిలిపివేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News