Andhra Pradesh: ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూడాలని ఏపీఎస్ఆర్టీసీ ఎండీతో మాట్లాడాం: ముఖేశ్ కుమార్ మీనా
- ఏపీలో రేపు సార్వత్రిక ఎన్నికలు
- ఒకే రోజున అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు
- ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ఓటర్లను అడ్డుకునేవారిపై చర్యలు తప్పవన్న మీనా
దేశంలో రేపు (మే 13) నాలుగో దశ సార్వత్రిక ఎన్నికలు జరగనుండగా, ఏపీలోనూ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. దీనిపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (ఏపీ సీఈవో) ముఖేశ్ కుమార్ మీనా మీడియాతో మాట్లాడారు.
ఓటు వేసేందుకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ఓటర్లను అడ్డుకోవాలని ప్రయత్నిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. రేపటి పోలింగ్ నేపథ్యంలో, ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని ఏపీఎస్ఆర్టీసీ ఎండీతో మాట్లాడామని వెల్లడించారు.
ఏపీలో హింసకు తావులేని రీతిలో, రీ పోలింగ్ అవసరం రాని విధంగా ఎన్నికలు జరపాలన్నదే తమ లక్ష్యం అని ముఖేశ్ కుమార్ మీనా తెలిపారు. పట్టణ ప్రాంత ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రప్పించే దిశగా కృషి చేస్తున్నామని చెప్పారు. 100 శాతం పోలింగ్ నమోదయ్యేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
ఈసారి ఎన్నికల కోసం గతంలో ఎప్పుడూ లేనంతగా పోలీస్ పరిశీలకులను, సాధారణ పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం నియమించిందని... ఎన్నికల బందోబస్తు కోసం కర్ణాటక, తమిళనాడు పోలీసు బలగాలతో పాటు కేంద్ర బలగాలను కూడా రప్పించామని ఏపీ సీఈవో ముఖేశ్ కుమార్ మీనా వెల్లడించారు. ఎక్కడా హింసాత్మక ఘటనలకు అవకాశం ఇవ్వకూడదని జిల్లా ఎస్పీలకు ఈసీ స్పష్టం చేసిందని పేర్కొన్నారు.
వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ కేంద్రాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటామని, పోలింగ్ కేంద్రాల్లో లోపల, బయట వెబ్ కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. పోలింగ్ శాతాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు ప్రత్యేక యాప్ (పోల్ డేటా మానిటరింగ్ యాప్)ను తీసుకువచ్చామని వెల్లడించారు.
రేపటి పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, ఈ రాత్రి 7 గంటలకల్లా ఎన్నికల సిబ్బంది అందరూ తమకు కేటాయించిన పోలింగ్ బూత్ లకు చేరుకునేలా ఏర్పాట్లు చేశామని చెప్పారు.