Betting: బెట్టింగ్‌లో రూ. 2 కోట్లు పోగొట్టుకున్న కుమారుడు.. ఇనుపరాడ్డుతో కొట్టి చంపేసిన తండ్రి

Father Kills Son With Iron Rod Over Betting Issue

  • మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలంలో ఘటన
  • బెట్టింగ్, జల్సాలకు అలవాటు పడి ఇల్లు, ఫ్లాట్ అమ్మేసిన ముకేశ్
  • తండ్రి పలుమార్లు నచ్చజెప్పినా వినిపించుకోని వైనం

బెట్టింగ్ యాప్‌ల బారినపడి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. బెట్టింగ్ ఉచ్చులో చిక్కుకుని అందినకాడికి అప్పులు చేసి ఆపై చెల్లించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. బెట్టింగ్‌కు బానిసై రూ. 2 కోట్లు పోగొట్టుకున్న కుమారుడిని ఓ తండ్రి నిర్దాక్షిణ్యంగా కొట్టి చంపాడు. మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలంలో జరిగిందీ ఘటన. 

బగిరాత్‌పల్లికి చెందిన ముకేశ్ ‌కుమార్ (28) బెట్టింగ్, జల్సాలకు బాగా అలవాటు పడ్డాడు. విషయం తెలిసిన తండ్రి హెచ్చరించినా వ్యసనాలకు దూరంగా జరగలేకపోయాడు. బెట్టింగ్ మాయలో పడి రూ. 2 కోట్ల వరకు పోగొట్టాడు. ఎన్నిసార్లు చెప్పినా కుమారుడు తన ప్రవర్తన మార్చుకోకపోవడంతో గత రాత్రి ముకేశ్‌పై తండ్రి ఇనుప రాడ్డుతో దాడిచేశాడు. రాడ్డు తలపై బలంగా తగలడంతో ముకేశ్ మరణించారు. రైల్వే ఉద్యోగి అయిన ముకేశ్ బెట్టింగ్‌కు బానిసై ఇల్లు, ఫ్లాటు అమ్మేసినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ముకేశ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News