Odisha: జిల్లాల పేర్లు చెప్పాలంటూ మోదీ సవాల్.. ఒడిశా సీఎం పట్నాయక్ స్పందన ఇదిగో!

Naveen Patnaik Reminds Him Of Forgotten Promises

  • ఒడిశాకు మీరు ఇచ్చిన హామీలలో ఎన్ని గుర్తున్నాయంటూ మోదీకి కౌంటర్
  • సంస్కృత భాషకు వెయ్యి కోట్లు.. ఒడియా భాషకు పైసా కూడా ఇవ్వలేదని ఫైర్
  • రాష్ట్రంలో భారత రత్న అందుకునే అర్హత ఉన్న వాళ్లే కనిపించలేదా అని ప్రశ్న
  • బిజూ పట్నాయక్ కు భారత రత్న ఎందుకు ప్రకటించలేదని నిలదీసిన నవీన్ పట్నాయక్

ఒడిశాలోని అన్ని జిల్లాల పేర్లు, వాటి రాజధానుల పేర్లను నవీన్ పట్నాయక్ ఎలాంటి నోట్స్ చూడకుండా చెప్పలేడని ప్రధాని నరేంద్ర మోదీ ఛాలెంజ్ చేశారు. శనివారం ఒడిశాలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని జిల్లాల పేర్లే గుర్తుండని వ్యక్తికి రాష్ట్రంలోని ప్రజల సమస్యలు ఎలా అర్థమవుతాయని ప్రశ్నించారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తాజాగా స్పందించారు. సోషల్ మీడియాలో ఓ వీడియో సందేశం విడుదల చేశారు. తనకు జిల్లాల పేర్లు గుర్తుండవన్న విమర్శలపై పట్నాయక్ మాట్లాడుతూ.. మోదీజీ.. ఒడిశాకు మీరు ఇచ్చిన హామీలలో మీకెన్ని గుర్తున్నాయని నిలదీశారు. 

‘సంస్కృత భాష అభివృద్ధికి రూ.వెయ్యి కోట్లు కేటాయించిన మీరు ఒడియాకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. క్లాసికల్ లాంగ్వేజ్ హోదా ఉన్నప్పటికీ ఒడియాను మర్చిపోయారు. ఒడిస్సీ మ్యూజిక్ కు క్లాసికల్ హోదా కోసం తాను రెండు సార్లు ప్రతిపాదనలు పంపినా వాటిని బుట్టదాఖలు చేశారు. ఒడిశాలో ఎంతోమంది గొప్పవాళ్లు, మహానుభావులు ఉన్నారు. వారిలో కొందరి పేర్లను మీరు కూడా మీ ప్రసంగంలో ప్రస్తావించారు. అలాంటి మహనీయులు భారత రత్నకు అర్హులు కారా? ఒడిశా పుత్రుడు బిజూ పట్నాయక్ కు భారత రత్న పొందే అర్హత లేదా?. ఎన్నికల సమయంలోనే ఒడిశాను గుర్తుచేసుకోవడం వల్ల మా రాష్ట్రానికి ఒరిగేదేమీ ఉండదు. 2014 - 2019 మధ్య కాలంలో మీరిచ్చిన హామీలు గుర్తున్నాయా? గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తానని, జీఎస్టీ నుంచి మినహాయింపు ఇస్తామని, ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని.. ఇలా మీరు ఇచ్చిన హామీలు ఎలా మర్చిపోయారు?’ అంటూ మోదీపై నవీన్ పట్నాయక్ విరుచుకుపడ్డారు.

  • Loading...

More Telugu News