Dr Suneetha Reddy: కడప ప్రజలు ఎటువైపు ఉంటారో జూన్ 4న ప్రపంచానికి తెలుస్తుంది: డాక్టర్ సునీత
- ఆలోచించి ఓటు వేయాలన్న సునీత
- వివేకాకు న్యాయం చేయాలని వినతి
- న్యాయం వైపు నిలుస్తారని భావిస్తున్నానని వ్యాఖ్య
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీతా రెడ్డి ఇవాళ మీడియా సమావేశం నిర్వహించారు. ఎల్లుండి (మే 13) పోలింగ్ జరగనున్న నేపథ్యంలో, కడప లోక్ సభ నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి సందేశం వెలువరించారు.
ఈ మధ్య కాలంలో కడప లోక్ సభ నియోజకవర్గంలో అనేకమందిని వారి ఇంటికి వెళ్లి కలిశానని, కొందరి ఇళ్లకు వెళ్లలేకపోయానని, వారందరూ తనను మన్నించాలని అన్నారు. దయచేసి ఓటు వేసేటప్పుడు ఆలోచించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఐదేళ్ల పాటు సుదీర్ఘపోరాటం చేశానని, గత మూడు నెలల కాలం ఓ ప్రత్యేక అధ్యాయం అనొచ్చని పేర్కొన్నారు. ఎల్లుండి జరిగే పోలింగ్ తో ఈ అధ్యాయం ముగియనుందని వివరించారు.
"మాలో మొదలైన ఆవేదన, మా పోరాటం ప్రజలు గుర్తించారన్న సంగతి మాకు సంతోషం కలిగిస్తోంది. ఇది ఈ జిల్లా ప్రజలే కాదు, మన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా గమనిస్తున్నారు. వైఎస్ వివేకా గారు ప్రజల నాయకుడు. ఆయనకు న్యాయం జరగాలని ప్రజలందరూ ముందుకొచ్చి సహకరిస్తున్నారు. వైఎస్ వారసులుగా షర్మిలను గెలిపించాలని శిరసు వంచి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.
రాజకీయాలకు అతీతంగా, ప్రజల్లోంచి వస్తున్న స్పందన చూసి మాలో భావోద్వేగాలు పెల్లుబికాయి. ఈ మూడు నెలల్లో నేను తప్పటడుగులు వేసినా మీరు చక్కదిద్దారు, నాకు ఓనమాలు నేర్పించారు. మరి కొన్ని గంటల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. వివేకా గారికి న్యాయం చేయాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు.
కడప రాజకీయ చరిత్రలో ఈ పోరాటం చిరస్థాయిగా నిలిచిపోతుందని భావిస్తున్నాను. రాజకీయాలకు అతీతంగా సహకరించిన ప్రతి ఒక్కరికీ, అభిమానులకు, ప్రజలకు, నాయకులకు, మీడియా ప్రతినిధులకు, పోలీస్ వ్యవస్థకు, ప్రభుత్వ సిబ్బందికి, మిత్రులకు, అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.
మే 13వ తేదీన మీరందరూ ఓటు వేయడానికి ఎన్నికల కేంద్రానికి వెళతారు. ఆ సమయంలో మీ మనస్సాక్షికి, మీ ఓటుకు మధ్య ఎవరూ అడ్డం లేరు. మీరందరూ న్యాయం వైపు ఉంటారని భావిస్తున్నాను.
జరిగిన అన్యాయం మీ అందరికీ తెలుసు. పార్టీలకు అతీతంగా... మీరు కాంగ్రెస్ అయినా, వైసీపీ అయినా, టీడీపీ అయినా, బీజేపీ అయినా, సీపీఐ అయినా, సీపీఎం అయినా... ఏ పార్టీ అయినా, దీన్నొక న్యాయపోరాటంగా భావించి న్యాయం వైపు నిలిచి హస్తం గుర్తుకు ఓటేస్తారని భావిస్తున్నాను.
మరొక్కసారి మీ అందరికీ విన్నపం... వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ వివేకానందరెడ్డి మనందరి మనుషులుగా, మనందరి రాజకీయ నాయకులుగా మూడ్నాలుగు దశాబ్దాలు పనిచేశారు. ఈ న్యాయపోరాటాన్ని ప్రపంచమంతా గమనిస్తోంది. కడప ప్రజలు న్యాయం వైపే ఉంటారని జూన్ 4న ప్రపంచానికంతటికీ తెలుస్తుంది. ఈ విషయాన్ని నేను గట్టిగా నమ్ముతున్నాను" అంటూ సునీతారెడ్డి పేర్కొన్నారు.