AP High Court: పథకాలకు నిధుల నిలిపివేతపై పిటిషన్లు... తీర్పు రిజర్వ్ లో ఉంచిన ఏపీ హైకోర్టు

AP High Court reserves verdict on funds release issue

  • ఏపీలో ఎన్నికల కోడ్ అమలు
  • నిధుల విడుదలకు ఈసీ బ్రేక్
  • హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్లు
  • ఈసీకి మరోసారి విజ్ఞప్తి చేయాలన్న ఏపీ హైకోర్టు
  • నేడు సమాధానమిచ్చిన ఈసీ

ఏపీలో ఎన్నికల్ కోడ్ అమల్లో ఉన్నందున, పథకాలకు నిధుల విడుదల ఆపేయాలంటూ ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడం తెలిసిందే. అయితే, ఈసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్లు దాఖలయ్యాయి. 

ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన న్యాయస్థానం... మరోసారి ఈసీకి విజ్ఞప్తి చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈసీ అభ్యంతరాలకు సమాధానమివ్వాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వం విజ్ఞప్తి చేయగా... ఈసీ నేడు సమాధానం ఇచ్చింది. ఇరుపక్షాల వాదనలు విన్న ఏపీ హైకోర్టు  ధర్మాసనం తీర్పును రిజర్వ్ లో ఉంచింది. 

కాగా, జనవరి-మార్చి మధ్యలో పథకాలకు బటన్లు నొక్కి అప్పుడే నిధులు విడుదల చేయకుండా, ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ఎలా నిధులు విడుదల చేస్తారని నేటి విచారణ సందర్భంగా కోర్టు ప్రశ్నించింది. 

సైలెంట్ పీరియడ్ లో నిధుల విడుదలకు అవకాశం లేదని ఈసీ స్పష్టం చేసింది. అందుకు ప్రభుత్వం తరఫు న్యాయవాది బదులిస్తూ... తామేమీ కొత్త పథకాలు ప్రకటించలేదని, ఎప్పటినుంచో నడుస్తున్న పథకాలకు మాత్రమే నిధులు విడుదల చేయాలనుకుంటున్నామని చెప్పారు. 

అందుకు, ఈసీ తరఫు న్యాయవాది స్పందిస్తూ... ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యాక జూన్ 6న నిధులు విడుదల చేసుకోవాలని గతంలో తాము చెప్పామని, ఇప్పుడు పోలింగ్ పూర్తయ్యాక నిధులు విడుదల చేసుకోవచ్చని చెబుతున్నామని అన్నారు. అనంతరం కోర్టు తదుపరి విచారణను వాయిదా వేసింది.

More Telugu News