Chandrababu: ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ లో విధ్వంసం సృష్టించారు: మాజీ సీఎం చంద్రబాబు

Chandrababu Interview

  • జగన్ ఐదేళ్ల పాలనపై చంద్రబాబు తీవ్ర విమర్శలు
  • పరిశ్రమలు, అమరావతిని, పోలవరం ప్రాజెక్టును నాశనం చేశారన్న బాబు
  • సచివాలయాలను తాకట్టు పెట్టేశారన్న చంద్రబాబు
  • యువతను నిర్వీర్యం చేసేశారన్న సీబీఎన్ 

వైసీపీ ఐదేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్ లో విధ్వంసం సృష్టించారని ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. రాజధాని అమరావతిని, పోలవరం ప్రాజెక్టుని, పరిశ్రమలను జగన్ పూర్తిగా నాశనం చేసేశారని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ పరిపాలనపై చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో యువతను నిర్వీర్యం చేసేశారని ఆరోపించారు. 

రాష్ట్రంలో ఎన్డీయే కూటమి అధికాంలోకి రాగానే రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెడతామని చంద్రబాబు చెప్పారు. నరేంద్రమోదీ మళ్లీ మూడోసారి ప్రధానమంత్రి కావడం ఖాయమని, ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో కేంద్రం సహకారం చాలా కీలకమని బాబు వెల్లడించారు. జగన్ పరిపాలనకు ఏపీ ప్రజలు భయపడిపోయారని, జగన్ పాలనలో రాజకీయ నాయకులు గానీ, సామాజిక కార్యకర్తలు గానీ పనిచేసే పరిస్థితి లేదని చెప్పారు. జగన్ పరిపాలన తెలుగు జాతి మనుగడకే ప్రశ్నార్థకంగా మారిందని ఆరోపించారు. 

ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగులు సైతం పనిచేసే పరిస్థితి లేదన్నారు. ఇటీవల జరిగిన పోస్టల్ ఓటింగ్ లో ప్రభుత్వ వ్యతిరేకత వారిలో స్పష్టంగా కనిపించిందన్నారు. వైసీపీ తరఫున పోటీచేసి గెలిచిన ఎంపీ రఘురామ కృష్ణరాజును జగన్ ప్రభుత్వం చాలా ఇబ్బంది పెట్టిందని ఇన్నేళ్ల దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఒక ఎంపీని ఆ విధంగా ఇబ్బందులు పెట్టడం ఏ ప్రభుత్వమూ చేయలేదని చంద్రబాబు తెలిపారు. ఆయనపై తప్పుడు కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లో ఆయనను టార్చర్ చేయడాన్ని ఒక ముఖ్యమంత్రి చూడటం దేశంలో ఎక్కడా జరగలేదని చంద్రబాబు వివరించారు. 

జగన్ తన ఐదేళ్ల పాలనలో 13 లక్షల కోట్ల రూపాయలను అప్పులు చేయడమే కాకుండా రాష్ట్రంలోని సచివాలయాలను, కలెక్టరేట్లను, ఆసుపత్రులను, రైతు బజార్లను కూడా తాకట్టు పెట్టేశారని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో సంపద సృష్టించే మార్గాలన్నింటినీ జగన్ పూర్తిగా మూసి వేశారని ఆరోపించారు. తాను అధికారంలోకి వస్తే సంపదను సృష్టించి రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతానని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వచ్చిన ఆదాయంతో ప్రజల సంక్షేమం కోసమే ఖర్చుపెడతానని చంద్రబాబు చెప్పారు.
  

Chandrababu
Andhra Pradesh
PM Modi
Polavaram Project
Amaravati
Telugudesam
YS Jagan
AP Politics

More Telugu News